సచిన్ సినిమా.. సినిమాయేనా?

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ ట్రైలర్ వచ్చేసింది. రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్ సచిన్ అభిమానుల్లో ఒక రకమైన ఎమోషన్ తీసుకొస్తుందనడంలో సందేహం లేదు. గత పదేళ్లలో క్రికెట్ అభిమానులుగా మారిన ఈ తరం యువతను మినహాయిస్తే.. అంతకుముందు నుంచే క్రికెట్ ను ఆరాధిస్తున్న ఎవ్వరికైనా ఈ ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం. సచిన్ ను వ్యతిరేకించేవారు కూడా భారత క్రికెట్ పై అతడి ప్రభావాన్ని విస్మరించలేరు. అతడి మేనియా ఎలాంటిదో.. అతడి గొప్పదనం ఏంటో అందరికీ తెలుసు. సచిన్ అనే పేరు చుట్టూ ఉన్న మాస్ హిస్టీరియా అన్నది మాటల్లో వర్ణించలేని విషయం.

‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ ట్రైలర్లో సా…చిన్ సా….చిన్ అంటూ వినిపించే శబ్దాలు విన్న ఎవ్వరికైనా మాటల్లో చెప్పలేని అనుభూతి కలగడం ఖాయం. టీజర్.. ట్రైలర్ ను బట్టి చూస్తే ‘సచిన్’ రెగ్యులర్ సినిమా టైపు కాదన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది డాకుమెంటరీ. ఐతే దీన్ని పూర్తి డాకుమెంటరీలా కాకుండా విభిన్నంగా ప్రెజెంట్ చేసినట్లున్నాడు బ్రిటిషన్ డైరెక్టర్ జేమ్స్ ఎర్కిన్సన్. అతను స్పోర్ట్స్ బయోపిక్స్.. డాకుమెంటరీలు తీయడంలో దిట్ట. అందుకే ప్రతిష్టాత్మకమైన సచిన్ సినిమాకు అతణ్ని ఎంచుకున్నారు. ధోని సినిమాలాగో.. మిల్కాసింగ్ సినిమాలాగో రెగ్యులర్ బయోపిక్స్ ఫార్మాట్లో తీయాలంటే మన డైరెక్టర్లనే ఆశ్రయించేవారు. కానీ దీన్ని భిన్నంగా తీయాలని అతణ్ని డైరెక్టర్‌గా పెట్టుకున్నారు.

సచిన్ బాల్యం వరకు నటీనటులతో సన్నివేశాలు తెరకెక్కించి.. ఆ తర్వాత అతడి కెరీర్‌ను మ్యాచ్‌ విజువల్స్ ఆధారంగా చూపించబోతున్నారు. మధ్యమధ్యలో సచిన్ భార్య, ధోని లాంటి వాళ్ల అభిప్రాయాల మాలిక ఉంటుంది. మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి ఉదంతాల సమయంలో భారత్‌లో తలెత్తిన పరిస్థితుల్ని.. సచిన్ బృందం ఫీలింగ్స్‌ను.. ఆ చేదు అనుభవాల నుంచి భారత అభిమానుల్ని ఆటవైపు మళ్లించడంలో సచిన్ పాత్రను కూడా ఇందులో చూపించబోతున్నారు. మొత్తంగా సచిన్ సినిమా అన్నది ప్రతి భారత క్రికెట్ అభిమానికీ ఓ ప్రత్యేక అనుభూతిని కలిగించేలాగే కనిపిస్తోంది. ఇది నోస్టాల్జిక్ ఫీలింగ్ కలిగించేలా అనిపిస్తోంది. సచిన్ సినిమా.. సినిమా కాదు, ఒక ఎమోషన్ అన్న ఫీలింగ్ కలిగించింది ట్రైలర్. –