హీరోయిన్ గా కంటే డాక్టర్ గా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతాను: సాయిపల్లవి


తెలుగు తెరపై గ్లామర్ పరంగా చెప్పుకోవాలంటే చాలామంది హీరోయిన్లు కనిపిస్తారు. కానీ నటన పరంగా చెప్పుకోవాలంటే మాత్రం ముందుగా సాయిపల్లవి పేరు మాత్రమే వినిపిస్తుంది. అంతగా ఆమె తన నటనతో ప్రేక్షకులను ప్రభావితం చేస్తుంది. ‘ఫిదా’ .. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ .. ‘లవ్ స్టోరీ’ సినిమాలు సాయిపల్లవి నటనకు అద్దం పడతాయి. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం .. డాన్స్ లో ఎక్స్ ప్రెషన్ మిస్ కాకుండా చూసుకోవడం ఆమె ప్రత్యేకత.

పాత్ర ఏదైనా దానిని ఒక పరీక్షగా భావించి అందులో 100 మార్కులు తెచ్చుకోవడానికి ఆమె ప్రయత్నిస్తుంది. ఇక తమిళ .. మలయాళ భాషలతో పాటు ఆమె ఇంగ్లీష్ .. హిందీ భాషల్లోను దుమ్మురేపేస్తుంది. తెలుగులో ఆయా ప్రాంతలకు చెందిన ‘యాస’లను నేర్చుకుని పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేయడం ఆమెలోని మరో విశేషం. ఇక డాన్స్ అనగానే తెరపై సాయిపల్లవి ఒక ప్రవాహంలా మారిపోతుంది. ఆమెను ఫ్రేమ్ లో పట్టుకోవడానికి అటు కెమెరా .. ఇటు హీరో నానా కష్టాలు పడతారు. సీన్లో తాను ఉన్నప్పుడు అందరి దృష్టి తనపైనే ఉండేలా చేయడం సాయిపల్లవికి మాత్రమే తెలిసిన విద్య.

సాయిపల్లవి ఎంబీబీఎస్ చదివిన సంగతి తెలిసిందే. అందువలన భవిష్యత్తులో నటిగానే కొనసాగాలనే ఆలోచన ఉందా? లేదంటే వైద్య రంగం వైపు వెళ్లే ప్లానింగ్ ఏదైనా ఉందా? అనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో సాయిపల్లవికి ఎదురైంది. అందుకు ఆమె స్పందిస్తూ .. ” భవిష్యత్తులో మెడికల్ ప్రొఫెషన్ వైపే వెళ్లే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఒక డాక్టర్ గా నేను నా చుట్టూ ఉన్న ప్రజలకు సేవలు చేయాలని అనుకుంటున్నాను. అందువలన ఆ దిశగానే నా అడుగులు పడతాయని నేను స్థిరంగా చెప్పగలను. ఇక అప్పుడు కూడా ఛాలెంజింగ్ రోల్స్ ఏమైనా వస్తే చేసే అవకాశం లేకపోలేదు.

ఇక ప్రస్తుతం నేను తెలుగులో చేసిన ‘విరాటపర్వం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. రానా కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నా మనసుకు బాగా నచ్చిన పాత్ర అది. ఈ సినిమా విడుదల తరువాత ఈ పాత్ర చాలామందికి కనెక్ట్ అవుతుంది .. చాలామందికి గుర్తుండిపోతుంది. ఈ సినిమా విడుదల కోసం నేను కూడా ఎంతో ఆసక్తితో .. ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను. ఇక ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో నేను చేసిన పాత్ర కూడా చాలా భిన్నమైంది.

నాని సరసన నటించిన ఆ పాత్రలో నా లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా కథాకథనాలు .. నా పాత్రను డిజైన్ చేసిన తీరు నాకు బాగా నచ్చింది. నా కెరియర్లో నేను చేసిన మంచి సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. తెలుగులో మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలను త్వరలోనే చెబుతాను” అని అంది.