పుష్పలో ఆ పాట కాపీ క్యాట్?

పెద్ద సాహిత్యం లేదు. కానీ.. ఇట్టే పట్టేసేలా.. సింపుల్ గా రాసినట్లుగా ఉంది ‘పుష్ప’ మూవీలోని ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ ఐటెమ్ సాంగ్. తాజాగా విడుదలైన ఈ సాంగ్ కు బోలెడన్ని ప్రత్యేకతలు. ఊర నాటు పాటగా ఉన్న ఈ పాటను పాడిన గొంతు నుంచి మత్తు టన్నుల కొద్దీ పొంగిపొర్లుతూ.. అందరిని ఇట్టే అకర్షిస్తోంది. మరోవైపు.. ఈ పాటకు సంచలన తార సమంత కాలు కదపటం ఒక ఎత్తు అయితే.. దేవీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట ఇప్పుడు అందరి నోట నానుతోంది.

మోస్ట్ ఎవైటింగ్ మూవీగా బజ్ వచ్చేసిన బన్నీ ‘పుష్ప’ మొదటి భాగం వచ్చే వారం వెండితెర మీద సందడి చేయనుంది. ఈ పాన్ ఇండియా మూవీ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం తాజాగా సమంత చేసిన ఐటమ్ సాంగ్ ను విడుదల చేయటం.. విపరీతమైన ఆదరణ వెల్లువెత్తటం తెలిసిందే. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఈ పాటకు ఇప్పుడు కాపీ మరక అంటింది.

మగబుద్ధిని ఎత్తి చూపేలా సాగిన ఈ పాట అందరిని ఆకట్టుకునేలా సాగింది. అందులోని ఈ పాట వేరే వారు చేసి ఉంటే.. ఇంత ఆసక్తి వ్యక్తమయ్యేది కాదు. సమంత చేయటం.. ప్రస్తుతం ఆమె ఎదుర్కొంటున్న వ్యక్తిగత జీవిత సమస్యల వేళ.. మగాళ్ల బుద్ధిని చాటి చెప్పేలా ఉన్న ఈ పాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఈ పాటను విన్న పలువురు.. దీన్ని ఎప్పుడో.. ఎక్కడో విన్నట్లుగా ఫీల్ కావటం.. ఆ వెంటనే దీని మూలాల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు.

అలాంటి ప్రయత్నాల్లో కొందరు సక్సెస్ కావటమే కాదు.. ఈ ఊర మాస్ పాట.. తమిళ హీరో సూర్య నటించిన ‘వీడొక్కడే’ మూవీలో హానీ.. హానీ.. పాట మాదిరి ఉందంటూ చెబుతున్నారు. ఈ ఐటమ్ సాంగ్ తో పుష్ప మరో స్థాయికి వెళ్లిందన్న మాట వినిపిస్తున్న వేళలోనే.. దీనికి కాపీ క్యాట్ అన్న ముద్ర పడటం.. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు కావటం గమనార్హం. మరి.. దీనికి యూనిట్ ఏమని చెబుతుందో చూడాలి.