కరోనా వైరస్ కారణంగా సినిమా ఇండస్ట్రీ ఎంతలా నష్టపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే షూటింగ్స్, సినిమా రిలీజ్ లు లేక దాదాపు రెండున్నర నెలలు గడిచిపోగా ఒక్క టాలీవుడ్ కే వందల కోట్ల నష్టం వచ్చినట్లు సమాచారం. ఇలా డైరెక్ట్ గానే కాకుండా ఇన్ డైరెక్ట్ గా కూడా టాలీవుడ్ పై కరోనా ప్రభావం ఉంటోంది. ముఖ్యంగా స్క్రిప్ట్స్ విషయంలో రచయితలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడా లిప్ లాకులు, గాఢమైన రొమాంటిక్ సన్నివేశాలు లేకుండా చూసుకోవాలి. అలాగే పాటల్లో గ్రూప్ డ్యాన్సర్లు ఇక కొంత కాలం చూడలేమేమో. అన్నిటికన్నా ముఖ్యమైనది ఫారిన్ షెడ్యూల్స్. ఇప్పట్లో ఫారిన్ లో షూటింగ్ చేసే అవకాశం లేదనే చెప్పాలి.
ఫారిన్ లో షూటింగ్ ఉన్న ప్రకారంగా స్క్రిప్ట్ రాసుకున్న సినిమాలకు కూడా ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో నటించనున్న సర్కారు వారి పాటకు కూడా ఈ ఇబ్బందులు తప్పలేదు. పరశురామ్ ముందుగా ఈ సినిమా కోసం రాసుకున్న స్క్రిప్ట్ లో 40 రోజుల అమెరికా షెడ్యూల్ ఉందట. సినిమాకు అది చాలా కీలకమని భావించారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితిలో ఫారిన్ లో షూటింగ్ చేసే అవకాశం లేదు. పైగా అమెరికాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా మరో ఆరు నెలల పాటు అక్కడికి వెళ్లడం అనే మాటే మర్చిపోవాలేమో.
ఈ నేపథ్యంలో పరశురామ్ అమెరికా ఎపిసోడ్ ను క్యాన్సిల్ చేసి ఇండియాలోనే షూటింగ్ ఉండేలా స్క్రిప్ట్ ను మార్చి రాసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ సినిమాకే కాకుండా ఫారిన్ షెడ్యూల్స్ వేసుకున్న అన్ని సినిమాలకూ ఈ ఇబ్బంది తప్పట్లేదు.