చిన్నమ్మ కనీసం ఓటు కూడా వేయలేక పోయింది

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్న సమయంలో చిన్నమ్మ శశికళ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా సాగింది. ఆమె మంత్రులపై కూడా పెత్తనం చేసి షాడో సీఎంగా వ్యవహరించింది. జయలలిత మృతి చెందిన సమయంలో అనూహ్యంగా శశికల సీఎం అవ్వాల్సి ఉన్నా కూడా అక్రమాస్తుల కేసులో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లింది. నాలుగు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి వచ్చిన శశికళ తిరిగి రాజకీయాల్లో ఒక వెలుగు వెలగడం ఖాయం అనుకున్నారు అంతా. కాని అనూహ్యంగా ఆమె రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. ఎన్నికల్లో పోటీ చేయలేదు సరి కదా కనీసం ఆమె ఈ ఎన్నికల్లో ఓటు కూడా వేయలేక పోయింది.

పోయేస్‌ గార్డెన్‌ అడ్రస్‌ తో ఉన్న శశికళ ఓటు గల్లంతయ్యింది. పోయేస్‌ గార్డెన్‌ ను జయలలిత స్మారకంగా మార్చిన విషయం తెల్సిందే. దాంతో ఆ అడ్రస్‌ తో ఉన్న ఓట్లు అన్ని కూడా ఎన్నికల కమీషన్‌ తొలగించడం జరిగింది. పోయేస్‌ గార్డెన్‌ అడ్రస్‌ తో ఉన్న శశికళ ఓటుతో పాటు ఇంకా పలువురి ఓట్లు కూడా గల్లంతయినట్లుగా సమాచారం అందుతోంది. అధికార పార్టీ అన్నాడీఎంకే కావాలని ఈ పని చేసిందంటూ శశికళ వర్గీయులు అంటున్నారు. మొత్తానికి సీఎం అవ్వాలనుకున్న శశికళ కనీసం ఓటు కూడా వేయలేక పోయిందని ఆమె మద్దతుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.