పవన్ సినిమాపై సెటైర్లు పడుతున్నాయ్

సినిమాలు చేసే విషయంలో.. పూర్తి చేసే విషయంలో పవన్ కళ్యాణ్‌కు చెడ్డ పేరుంది టాలీవుడ్లో. ఒక సినిమాకు ఇంకో సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటాడని.. షూటింగులకు సరిగా హాజరు కాడని.. తరచుగా బ్రేకులిచ్చేస్తుంటాడని పవన్‌పై విమర్శలున్నాయి. పవన్ గత కొన్నేళ్లలో చేసిన సినిమాల విషయం పరిశీలించినా.. ఈ విషయం వాస్తవమే అన్న సంగతి అర్థమైపోతుంది. ముఖ్యంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ ఎంత ఆలస్యమైందో.. సినిమా ఎన్నిసార్లు వాయిదా పడిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’ విషయంలోనూ జనాల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ సినిమా అనుకున్న సమయానికి సెట్స్ మీదికి వెళ్లని సంగతి తెలిసిందే.

ఐతే కొంచెం లేటుగా రెగ్యులర్ షూటింగ్ మొదలైనప్పటికీ.. ఆ తర్వాత మాత్రం నిరవధికంగా షూటింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 29న రిలీజ్ చేస్తారంటే నమ్మశక్యంగా అనిపించలేదు. ఎలాగూ సినిమా వాయిదా పడుతుందిలే అని జనాలు ఫిక్సయిపోయారు. ఐతే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మార్చి 29 కంటే ముందే విడుదలైపోతుందట. అనుకున్న దాని కంటే వారం ముందుగానే సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఐతే ఈ వార్తల్ని జనాలు తేలిగ్గా తీసుకుంటున్నారు. పవన్ సినిమా పోస్ట్ పోన్ అంటే నమ్ముతాం కానీ.. ప్రి పోన్ అంటే ఎలా నమ్మేది అని జనాలు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ సెటైర్లకు జవాబిస్తూ నిజంగానే ‘కాటమరాయుడు’ సినిమాను అనుకున్న దాని కంటే ముందే రిలీజ్ చేసేస్తారేమో చూడాలి.