బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. అందం, ఐశ్వర్యం కలిగిన అమ్మాయిలే టార్గెట్‌గా కాకినాడకు చెందిన దేవరాజు అనే వ్యక్తి ఆడిన వికృత క్రీడకు శ్రావణి బలి అయ్యింది. దేవరాజు అనే యువకుడి వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకొందని శ్రావణి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే మీడియాతో కూడా అదే విషయం చెప్పారామె.
తనకు తల్లిదండ్రులు లేరంటూ యువతుల సానుభూతి పొంది, ఆ తర్వాత అదే సాకుగా పరిచయం పెంచుకుని తన విశ్వరూ పాన్ని చూపించేవాడని చెబుతున్నారు. దేవరాజుకు ఒక సీరియల్‌లో నటించే అవకాశాన్ని శ్రావణి ఇప్పించిందని సమాచారం. గతంలో దేవరాజు వేధింపులపై శ్రావణి ఒకసారి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంలో దేవరాజు గురించి శ్రావణి మీడియాతో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పట్లో ఆ దుర్మార్గుడి గురించి ఆమె ఏం చెప్పారంటే…
“దేవరాజు రెడ్డి అందరికీ ట్వీట్‌లు చేస్తూ.. టిక్ టాక్‌లలో రిచ్‌గా ఉన్న వారి సెల్ నెంబర్లు తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లోకి రమ్మని.. అక్కా, చెల్లి అంటూ అందరికీ మెసేజ్‌లు పెడతాడు. వాళ్ల ఫోన్ నెంబర్లు, పర్సనల్ వీడియోలు తీసుకుని బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు వేధింపులకు గురిచేస్తాడు. డబ్బులు తీసుకుని, బాగా డబ్బులు ఉన్నవాళ్లతో తిరుగుతాడు. ఆ తర్వాత వాళ్లనే బ్లాక్ మెయిల్ చేస్తాడు” అని అప్పట్లో ఆమె చెప్పుకొచ్చారు. ప్రమాదాన్ని పసిగట్టి పోలీసుల్ని ఆశ్రయించినా ప్రయోజనం లేకపోవడం మరింత బాధ కలిగిస్తోంది.
తనలాగా అమ్మాయిలెవరూ అతని వేధింపుల బారిన పడకూడదని శ్రావణి అప్పట్లో హెచ్చరించడం గమనార్హం. ఇంకా ఆ యువతి ఏం చెప్పారో తెలుసుకుందాం.
“చెప్పిన మాట వినని వాళ్లని కొడతాడు. తనను ఎవరూ ఏమీ చేయలేని చెబుతాడు. దేవరాజుది కాకినాడ. కానీ అతను సికింద్రాబాద్‌లో ఉంటాడు. నాతో పాటు కొంత మంది అమ్మాయిలు ఉన్నారు. ఐదారు నెలలుగా మమ్మల్ని వేధింపులకు గురిచేస్తున్నాదు. ఇలాంటి వ్యక్తి పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి” అని శ్రావణి సూచించినా, తనను తాను ఆత్మార్పణం చేసుకోవడం గమనార్హం.
నిత్యం ఇలా ఎవరో ఒకరు కామాంధుల బారిన పడి వేధింపులకు గురవుతూ ప్రాణాలు తీసుకోవాల్సిందేనా? దేవరాజు లాంటి రాక్షసుల నుంచి మహిళల మానప్రాణాలకు రక్షణ లేదా? ఇంకెంత కాలం ఇలా? ఆ నటి తల్లిదండ్రుల కడుపుకోతను తీర్చే వారెవరు? శ్రావణి ఫిర్యాదుపై పోలీసులు తక్షణం చర్యలు తీసుకుని ఉంటే…ఈ వేళ ఆమె బతికి ఉండేది కాదా?