ఒక షకీలా.. 20 మంది ప్రేమికులు

మలయాళ శృంగార భరిత చిత్రాలతో ఒక టైంలో దక్షిణాది యువతను ఒక ఊపు ఊపింది షకీలా. ఐతే ఆ సినిమాల్లో ఆమె హవాకు తెరపడ్డాక షకీలా జీవితం అగమ్య గోచరంగా తయారైంది. సినిమాల్లో సంపాదన ఆగిపోయాక అయిన వాళ్లకు దూరమై.. ఆర్థిక ఇబ్బందులు పడి తాను ఎంత సతమతమైంది ఇంతకుముందే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది షకీలా. ఇప్పుడు ‘ఆలీతో జాలీగా’ కార్యక్రమంలో పాల్గొని తన పరిస్థితిపై మరింత ఓపెన్ అయింది షకీలా. జీవితంలో తనకంటూ ఒక తోడు లేకుండా పోయిందని షకీలా తెలిపింది. తన జీవితంలో 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని.. కానీ చివరికి వాళ్లల్లో ఎవ్వరూ తనతో నిలవలేదని షకీలా చెప్పడం విశేషం.

తాను ఎవరినైనా చూసి ఇంప్రెస్ అయితే.. మరుసటి రోజుకే ప్రేమలో పడిపోయేదాన్నని.. అలా అన్నింటినీ లెక్క పెట్టుకుంటే తన జీవితంలో 20 ప్రేమకథలున్నాయని షకీలా తెలిపింది. ఐతే రకరకాల కారణాల వల్ల వాళ్లలో ఒక్కొక్కరు దూరమైపోయారని షకీలా తెలిపింది. ఒకరు తన తల్లిని దూరం పెట్టమని అడగడంతో.. ఇంకొకరు అన్నయ్యకు సాయం చేయొద్దని చెప్పడంతో.. ఇంకొకరు తన మీద అజమాయిషీ చేయడంతో.. ఇలా ఒక్కొక్కరిని ఒక్కో కారణంతో దూరం పెట్టానని షకీలా తెలిపింది. తనతో ఉన్నవాళ్లలో కొందరు తనను శారీరకంగా చాలా హింసించారని చెప్పింది.

ఒక వ్యక్తి తనను తాగి విపరీతంగా తిట్టేవాడు, కొట్టేవాడని.. అయితే చాలా వరకు భరించానని.. కానీ ఒకరోజు మరీ ఎక్కువ కొట్టాడని.. దీంతో తాను హ్యాంగర్ తీసుకుని అతణ్ని చితకబాదానని.. అందులో మేకులున్న సంగతి కూడా చూడలేదని.. అలాగే చీరేసి.. ఒక కాల్ ట్యాక్సీ పిలిపించి అందులో తన ఇంటికి పంపించానని షకీలా వెల్లడించింది. చివరగా ఒక వ్యక్తితో ఏడేళ్ల పాటు కలిసున్నానని.. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నామని.. కానీ వాళ్లింట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో తనను వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేసింది షకీలా.