లాక్ డౌన్లో భారతీయ చిత్ర పరిశ్రమకు థియేటర్ బిజినెస్ కు ప్రత్యామ్నాయం దొరికింది. ఓటిటీ లో చిన్న సినిమాలు విడుదల చేస్తే లాభదాయకం అని తేలింది. ఇలా విడుదల చేయడం వల్ల సినిమా మామూలుగా ఉందని టాక్ వచ్చినా కానీ చూడాలనుకున్న వాళ్ళు, ఖాళీ ఉన్న వాళ్ళు ఒకసారి చూసేస్తున్నారు. దీంతో లాక్ డౌన్ తర్వాత డిజిటల్ కంటెంట్ పెద్ద స్థాయిలో రూపొందించడానికి పెద్ద నిర్మాణ సంస్థలు ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నాయి. అయితే టీవీని ఎలాగైతే సినిమా వాళ్ళు చిన్నగా చూస్తారో, స్టార్లు ఓటిటీని కూడా అలాగే చూస్తారు.
అందుకే ఈ ఫీల్డ్ చిన్న తారలకు బాగా కలిసి వస్తుంది. కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాతో జెర్సీ హీరోయిన్ శ్రద్ధ శ్రీనాధ్ అందరి దృష్టిలో పడింది. ఆమె నటించిన తమిళ చిత్రం చక్ర కూడా ఓటిటీలోనే విడుదల కానుంది. దీంతో ఆమెకు డిజిటల్ కంటెంట్ చేయడానికి ఇక అభ్యంతరం ఉండదు కనుక పలువురు నిర్మాతలు, ప్రొడక్షన్ మేనేజర్లు శ్రద్ధ డేట్స్ ఇప్పట్నుంచే లాక్ చేయాలని చూస్తున్నారు. శ్రద్ధ శ్రీనాధ్ కన్నడ, తమిళంలో కూడా పాపులర్ అవడం వల్ల డిజిటల్ కంటెంట్ రీచ్ కి ఆమె చాలా ప్లస్ అవుతుంది.