సినీ నటి శ్రీసుధపై వేధింపుల కేసులో టాలీవుడ్ సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె.నాయుడుకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నెలరోజుల్లోగా వీటిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. శ్యామ్ కె.నాయుడుతో తనకు ప్రాణహాని ఉందని… ఆయన బెయిల్ రద్దు చేయాలని శ్రీసుధ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టి శ్యామ్ కె.నాయుడితో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో సహజీవనం చేసి మోసగించాడని శ్రీసుధ గతంలో అతనిపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అతడు నకిలీ పత్రాలతో బెయిల్ తెచ్చుకున్నాడని శ్రీసుధ ఆరోపించింది.
పెళ్లి పేరుతో నమ్మించి ఐదేళ్లు తనతో సహజీవనం చేసిన శ్యామ్ కె.నాయుడు.. ఆ తర్వాత తనను మోసం చేశారని గత ఏడాది మేలో శ్రీసుధ మొదటిసారి హైదరాబాద్‌లోని ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్ కె నాయుడిని అరెస్ట్ చేయగా రెండు రోజుల్లోనే బెయిల్‌పై బయటకొచ్చాడు. అయితే ఈ కేసులో శ్యామ్ కె. నాయుడి తనతో రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి కోర్టును తప్పుదోవ పట్టించడం ద్వారా బెయిల్ పొందాడని శ్రీసుధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పత్రాలు నకిలీవని తేలడంతో అప్పట్లో అతని బెయిల్ కూడా రద్దయినట్లు కథనాలు వచ్చాయి. ఈ విషయంపై గత నెలలో మరోసారి ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీసుధ. ఇప్పటివరకూ అతన్ని అరెస్ట్ చేయలేదని ఆమె ఆరోపించారు.
కొద్దిరోజుల క్రితం విజయవాడ పోలీసులకు ఫిర్యాదు…
కొద్ది రోజుల క్రితం నటి శ్రీసుధ, శ్యామ్ కె నాయుడిపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కనకదుర్గ ఫ్లైఓవర్‌పై తన కారును ఢీకొట్టించి హత్యాయత్నం చేశారని… ఈ కుట్ర వెనుక శ్యామ్ కె నాయుడు ఉన్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తాను శ్యామ్ కె నాయుడుపై పెట్టిన కేసుకు, ఈ యాక్సిడెంట్‌కు లింకు ఉందని ఆరోపించారు. తనను అడ్డు తొలగించుకునేందుకు యాక్సిడెంట్ చేసి చంపేసేలా కుట్ర చేసి ఉంటాడని శ్రీసుధ అనుమానం వ్యక్తం చేశారు. శ్యామ్ కె.నాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరారు.