పైకి ఎంతో అందంగా కనిపించే ‘రంగుల ప్రపంచం’ వెనుక అంతులేని విషాద‘గాథలు’ ఎన్నో దాగున్నాయి. వెండితెరపై తళుకులీనుతూ డ్రీమ్ గర్ల్స్‌గా, కలల రాకుమారులుగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసి, పేరుప్రతిష్టలతో పాటు డబ్బు సంపాదించాలని చాలా మంది ఇండస్ట్రీలో అడుగుపెడతారు. అనుకున్నది సాధిస్తే ‘స్టార్లు’గా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. లక్ వెక్కిరిస్తే మాత్రం ఎంత ప్రతిభ ఉన్నా అధః పాతాళానికి పడిపోతారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక, ఒత్తిడికి లోనవుతారు. వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు, ఆర్థిక నష్టాలు కూడా ఇందుకు తోడైతే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలా బలవన్మరణం చెందిన తారలు ఎంతో మంది ఉన్నారు. వారిలో ‘సిల్క్’ స్మిత కూడా ఒకరు. ఆమె ఈ లోకాన్ని వీడి నేటికి ఇరవై నాలుగేళ్లు.
సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా వెలిగిపోవాలని కలలుగన్న విజయలక్ష్మి అలియాస్ సిల్క్ స్మిత ఇండస్ట్రీలో ఐటంగర్ల్‌గా సెటిలైంది. తన అందచందాలు, హావభావాలతో ‘మాస్’ను ఉర్రూతలూగించి, యువ ప్రేక్షకుల మనసు దోచుకుంది. అభిమానుల చేత ‘ఇండియన్ మార్లిన్ మన్రో’గా జేజేలు కొట్టించుకుంది. ఒకానొక సమయంలో కథానాయికల కంటే కూడా ఎక్కువ క్రేజ్ సంపాదించుకుని, డిమాండ్ ఉన్న నటిగా నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. సిల్క్ ఉంటే చాలు సినిమా హిట్టే అన్నంత క్రేజీ స్టార్‌గా వెలుగొంది, ‘గ్లామర్’ వరల్డ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
అయితే నటనలో భాగంగా చూపుల వలవేసి అందరినీ తనవైపు తిప్పుకోగల ఆకర్షణ ఉన్న సిల్క్ నిజజీవితంలో మాత్రం, తన మనసుకు బాగా నచ్చిన అతికొద్ది మందితో మాత్రమే ఫ్రెండ్లీగా మెలిగేవారట. బహుశా అందువల్లేనేమో నేటికీ ఆమె ఆత్మహత్య వెనుక గల స్పష్టమైన కారణాలు ఇంతవరకు వెల్లడి కాలేదు. ప్రేమలో విఫలమైనందు వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని కొంతమంది అంటే, మరికొంత మంది మాత్రం ఆర్థిక నష్టాల వల్లే తనను తాను అంతం చేసుకుందని అంటారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌లోని దెందలూరుకు చెందిన సిల్క్ స్మిత ఐదు భాషల్లో దాదాపు 450పైగా సినిమాల్లో నటించారు. 17 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఎత్తుపళ్లాలు చవిచూసిన ఆమె.. సినీ నిర్మాణంలో అడుగుపెట్టి తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో సెప్టెంబరు 23, 1996లో తన ఇంట్లో విగతజీవిగా కనిపించారు. అర్థాంతరంగా జీవితం ముగించి తన అభిమానులను విషాదంలోకి నెట్టారు.