టీడీపీ నేతల కోసం బీజేపీ గేట్లెత్తిందా?

ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ స్థానం దక్కించుకోవడానికి ఎప్పటినుంచో ఉవ్విళ్లూరుతున్న బీజేపీ.. ఆ మేరకు తన కసరత్తును వేగిరం చేసినట్టు కనపడుతోంది. నిజానికి ఏపీలో ఒక్క శాతం కూడా ఓటింగ్ షేర్ లేని బీజేపీ.. దాదాపు 40 శాతం ఓటు బ్యాంకు కలిగి ఉన్న టీడీపీని వెనక్కి నెట్టడం సులభం కాదు. అయినప్పటికీ తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

నేరుగా ఓటుబ్యాంకును సమీకరించుకోవడం కంటే టీడీపీ నాయకులను చేర్చుకుని వారి ద్వారా బలోపేతం కావాలని యోచిస్తోంది. తాజాగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొంతకాలంగా పార్టీ అధిష్టానంతో ఆయనకు సరిగా పొసగడంలేదు. ఈ నేపథ్యంలో శనివారం బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి సునీల్ సమక్షంలో బాబూరావు కాషాయ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. టీడీపీ నేతలకు స్వాగతం పలికారు. ‘‘ప్రతి టీడీపీ నేత బీజేపీలో చేరాలి. అందరికీ స్వాగతం చెబుతున్నా. చంద్రబాబుది వాడుకుని వదిలేసే విధానం. ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరికి జాతీయస్థాయిలో పదవి ఇచ్చిన ఘనత మాది. చంద్రబాబు కాలం చెల్లిన రాజకీయ నాయకుడు. కనీసం ప్రతిపక్ష నేతగా కూడా తన పాత్రను సక్రమంగా పోషించలేకపోతున్నారు’’ అని విమర్శలు సంధించారు.

ఏపీ బీజేపీ చీఫ్ గా వీర్రాజు బహిరంగంగానే టీడీపీ నేతలకు స్వాగతం పలకడం చూస్తుంటే.. చేరికలకు గేట్లెత్తినట్టే కనిపిస్తోంది. అయితే, బీజేపీ స్వాగతం పలికినంత మాత్రాన ఎంతమంది టీడీపీ నేతలు చేరతారన్నదే ప్రశ్న. ఏపీలో బీజేపీని జనం అసలే పట్టించుకోరని అంటున్నారు. పైగా ప్రత్యేక హోదా విషయాన్ని అటకెక్కించిన పార్టీ అది అని గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి పార్టీలోకి వెళ్లినంత మాత్రాన ఒరిగేదీముంటుందన్నది పలువురి సందేహం.

వైఎస్సార్ సీపీలోకి వెళ్లలేక.. ఇటు టీడీపీలో ఉండలేక సతమతమవయ్యే నేతలు మినహా మిగిలినవారు పెద్దగా కాషాయ పార్టీపై ఆసక్తి చూపరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రతిపక్ష పార్టీ స్థానం దక్కించుకోవాలనే బీజేపీ కల నెరవేరుతుందా అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.