వలస కూలీల కోసం ఏకంగా విమానం బుక్‌ చేసిన రియల్‌ హీరో

కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలో మీటర్ల దూరంను వలస కార్మికులు కేవలం కాలినడకన చేరుకున్న విషయం తెల్సిందే. లాక్‌ డౌన్‌ కారణంగా పనులు లేక పోవడంతో చాలా మంది తమ ప్రాంతాలకు చేరుకునేందుకు కాలి నడకను ఆశ్రయించారు. వారి బాధలను చూసి తట్టుకోలేక విలన్‌ పాత్రలు పోషించే నటుడు సోనూ సూద్‌ హీరోగా మారి వారికి బస్సులు ఏర్పాటు చేయించాడు. అందరికి కాకున్నా తనకు చేతనయినంత మందిని బస్సుల ద్వారా వలస కార్మికులను పంపించడం జరిగింది.

తాజాగా కేరళలో ఎర్నాకులం జిల్లాలో ఒక కుట్టు మిషన్‌ కంపెనీకి చెందిన 177 మంది మహిళ కార్మికులు ఒడిసాకు వెళ్లాలనుకుంటే లాక్‌డౌన్‌ కారణంగా పూర్తిగా రవాణ సదుపాయం లేకుండా పోయింది. దాంతో వారు పని లేక, తినడానికి తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వారి విషయాన్ని సన్నిహితుడి ద్వారా తెలుసుకున్న సోనూ సూద్‌ వారికి సాయం చేయాలని ఫిక్స్‌ అయ్యాడు. అందుకోసం ఏకంగా విమానంను బుక్‌ చేశాడు.

177 మందిని ఒకే విమానంలో పంపించడం సాధ్యం కాని విషయం అంటూ సన్నిహితులు అన్నా కూడా తనకున్న పరిచయాలతో విమానంను బుక్‌ చేసి బెంగళూరు నుండి కొచ్చికి పంపించి వారిని కొచ్చికి రప్పించి, అక్కడ నుండి భువనేశ్వర్‌కు తరలించి అక్కడ నుండి మళ్లీ వారిని సొంత ప్రాంతాలకు తరలించాడు. ఈ మొత్తం పక్రియకు కనీసం పాతిక లక్షలు అయినా సోనూసూద్‌ ఖర్చు చేసి ఉంటాడు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఆ 177 మంది మహిళలు కన్నీటితో సోనూసూద్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.