లక్కీగా బాలీవుడ్ వ్యక్తిని పెళ్లాడలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్

అనూహ్యమైన వ్యాఖ్యను చేసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్. బాలీవుడ్ దివాగా ఆమెకున్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఇటీవల కాలంలో బాలీవుడ్ జంటల మధ్య చోటు చేసుకుంటున్న బ్రేకప్ లపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన ఆమె తన మాటలతో షాకిచ్చింది. ‘దేవుడి దయ వల్ల ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లాడలేదు. అందుకు నిజంగా కృతజ్ఞురాలిని. అక్కడ పని చేసే వాళ్ల ప్రపంచం సంకుచితంగా ఉంటుంది. బాలీవుడ్ లో జరుగుతున్నది ఇదే’’ అంటూ ఒక మ్యాగ్ జైన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

పెళ్లి.. అనంతరం తన జీవితంలో చోటు చేసుకున్న మార్పుల గురించి కాస్త వివరంగానే ఓపెన్ అయిన సోనమ్ ఆసక్తికర అంశాల్ని చెప్పారు. ఇవన్నీ బాగానే ఉన్నా.. బాలీవుడ్ మీద ఆమె చేసిన వ్యాఖ్య పలువురికి మంట పుట్టేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. మూడేళ్ల క్రితం (2018లో)వ్యాపార వేత్త ఆనంద్ అహుజాను పెళ్లాడిన సోనమ్.. తమ మధ్య బంధాన్ని వెల్లడించారు.

తన మాదిరే ఆలోచించే ఫెమినిస్ట్ ను పెళ్లాడటం నిజంగా తన లక్ గా ఆమె చెప్పుకొచ్చారు. పెళ్లైన నాటి నుంచి ఈ ఏడాది వరకు ముంబయి.. ఢిల్లీ.. లండన్ మధ్య ప్రయాణాలకే తన టైం సరిపోయేదని.. ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ప్రతి రాత్రి కలిసి గడుపుతున్నట్లుగా పేర్కొన్నారు. తమ ఇద్దరి మధ్య ఒకరిపై ఒకరికి అంతులేని ప్రేమ ఉన్నట్లుగా చెప్పిన ఆమె.. తామిద్దరం కలిసినప్పుడు సంతోషానికి కొదవ ఉండదన్నారు.

పెళ్లి కారణంగా తాను లండన్ లో ఒంటరిగా ప్రయాణించటం అలవాటు చేసుకున్నానని.. ఆ సందర్భంగా తాను చాలా విషయాల్ని నేర్చుకున్నట్లు చెప్పారు. తాను చాలామందిని చూశానని.. భారతీయులు.. పాకిస్తానీయులు. బంగ్లా.. మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన వారందరికి బాలీవుడ్ అంటే ఒకలాంటి పిచ్చి ఉందన్న విషయం తనకు అర్థమైందని చెప్పింది. ఇవన్నీ బాగానే ఉన్నా..ఇతరుల వైవాహిక బంధం మీద సోనమ్ తొందరపడి తీర్పు చెప్పేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.