కరోనా సమయంలో ఎంతో మంది పేదవారికి అండగా నిలిచిన రియల్ హీరో సోనూసూద్ తాజాగా ఒక ఫొటో షేర్ చేశాడు. తన మెయిల్ లో ఉన్న ఈమెయిల్స్ సంఖ్యను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఈ స్క్రీన్ షాట్ చూస్తే ఎంతో మంది తమకు సాయం కావాలని ఆయనకు అభ్యర్థించినట్టుగా తెలుస్తోంది. సోనూసూద్ మెయిల్ లో ఏకంగా 52వేలకు పైగా ఈమెయిల్స్ ఉన్నట్లు ఈ ఫొటోలో కనిపిస్తోంది. ఈ ఫొటోను షేర్ చేసిన సోనూసూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘ఆశ నమ్మకం ప్రార్థనలు.. ఈ జీవితానికి ఇంకేం కావాలి’ అని పోస్ట్ చేశాడు. ఇదిప్పుడు వైరల్ గా మారింది. సోనూసూద్ పై ఐటీ దాడుల తర్వాత ఆయనపై విమర్శలు చేస్తున్న వారికి కౌంటర్ గా సోనూసూద్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
కరోనా సమయంలో సోనూసూద్ వలస కార్మికుల కోసం ప్రత్యేక విమానాలు బస్సులు ఏర్పాటు చేసి వారి మనసులు గెలుచుకున్నాడు. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఆస్తులపై ఇన్ కంటాక్స్ దాడులు కలకలం రేపాయి.
సోనూసూద్ ఇప్పటివరకూ రూ.20 కోట్ల పన్నులు ఎగవేశాడని అధికారులు ఆరోపించారు. అలాగే విదేశాల నుంచి సేకరించిన రూ.18 కోట్లకు పైగా విరాళాల్లో కేవలం రూ.1.9 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడని ఐటీశాఖ లెక్కలతో తెలిపింది.
ఇదే విషయాన్ని పరోక్షంగా తన ట్వీట్ లో ప్రస్తావించిన సోనూసూద్.. ‘నేను చూడాల్సిన మెయిల్స్ 54వేలకుపైగా ఉన్నాయి. 18 కోట్లు ఖర్చు చేయడానికి 18 గంటలు కూడా పట్టదు’ అంటూ పోస్ట్ చేశాడు.