సోనూసూద్ దాతృత్వం.. విద్యార్ధిని కోసం గ్రామం మొత్తానికి సాయం..

కరోనా విలన్ గా వచ్చి దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ సమయంలో ఓ వ్యక్తి హీరో అయిపోయాడు. అతనే సోనూసూద్. సినిమాల్లో అన్నీ విలన్ పాత్రలే చేసే సోనూ నిజ జీవితంలో తానేంటో.. తన మనసేంటో నిరూపించాడు. కరోనా దెబ్బకు కుదేలైన ఎన్నో కుటుంబాలకు సోనూసూద్ దేవుడే అయ్యాడు. ఇప్పటికీ ట్విట్టర్ లో తమ సమస్యలు చెప్పుకోవటమే తరువాయి.. వారికి సాయం చేస్తున్నాడు. రీసెంట్ గా ఓ విద్యార్ధిని చదువు కోసం పడుతున్న అవస్థలు తెలుసుకుని ఏకంగా ఆమె ఉంటున్న గ్రామానికే సాయం చేశాడు.

మహారాష్ట్రలోని సింధూ దుర్గ్ ప్రాంతానికి చెందిన స్వాప్నిల్ అనే విద్యార్థిని ఎంబీబీఎస్ ఎంట్రన్స్ పరీక్షల కోసం ఆన్ లైన్ లో తరగతులకు హాజరవుతుంది. గ్రామంలో వైఫై, ఇంటర్నెట్ సేవలు లేకపోవడంతో అవి ఉన్న చోటుకే ఆమె వెళ్లి తరగతులకు హాజరవుతోంది. ఆ ప్రదేశం ఆమె ఉంటున్న గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంల ఉన్న కొండపై ఉంది. అక్కడ చిన్న గుడిసె వేసుకుని అక్కడే చదువుకుంటోంది. రోజూ సోదరుడి సాయంతో అక్కడికి వెళ్లి తరగతులు విని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటోంది.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న సోను సూద్ స్పందించాడు. వివరాలు సేకరించాలని.. తెల్లారేసరికి ఆమె గ్రామంలో వైఫై ఉంటుందని ట్వీట్ చేశాడు. వివరాలు తెలుసుకున్న సోనూ సూద్ ఆమెతో పాటు ఆమె ఉంటున్న గ్రామం మొత్తానికి వైఫే ఏర్పాటు చేస్తున్నాడు. సోనూ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. విద్యార్ధిని ఫొటో ఇంటర్నెట్ లో వైరల్ అయింది.