ప్రసిద్ధ గాయకుడు, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కరోనా నెగిటివ్ అంటూ వచ్చిన వార్తల్ని ఆయన తనయుడు చరణ్ ఖండించారు. కోట్లాది మంది ప్రజల ప్రార్థనలు ఫలించాయని, కోట్లాది మంది గళాల వేడుకోలును దేవుళ్లు ఆలకించి బాలు ఆరోగ్యాన్ని కుదుట పరిచారనే వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టసాగాయి. దీంతో సంగీత ప్రియులు, బాలు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ క్రమంలో బాలు ఆరోగ్యం గురించి ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తాజా ప్రకటన మరోసారి ఆయన అభిమానుల్ని ఆందోళనకు గురి చేసింది. తన తండ్రికి కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చిందనే వార్తల్లో నిజం లేదని చరణ్ ఖండించారు. ప్రస్తుతం బాలు ఆరోగ్యంలో చెప్పుకోతగ్గ మెరుగుదల ఉండలేదన్నారు. తండ్రికి కరోనా నెగిటివ్ వచ్చినట్టు తన పేరుతో తప్పుడు ప్రకటన ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
ఈ నెల 5వ తేదీన ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడం, అదే రోజు చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే చేరినప్పుడు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత ఆయన శ్వాస తీసుకోవడం కష్టమైంది. దీంతో ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. అప్పటికీ పరిస్థితి కంట్రోల్ కాకపోవడంతో వైద్యులు మరింత ఆధునిక వైద్యాన్ని ప్రయోగించారు.
ఐసీయూలో చికిత్స పొందుతున్న బాలూకు ఫ్లాస్మా థెరపీ కూడా చేశారు. ప్రస్తుతం ఎక్మో సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చిందనే ఆనందం ఎంతో సేపు నిలవలేదు. తమ అభిమాన గాయకుడు త్వరగా కోలుకుని సంగీత ప్రపంచాన్ని ఓలలాడించాలని కోట్లాది మంది ప్రార్థిస్తున్నారు.