గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇకలేరు అనే వార్త సగటు భారతీయ సినీ ప్రేక్షకుడికి మింగుడుపడనిది. ఆయన పాడిన పాట వినని ప్రేక్షకులు.. ముఖ్యంగా దక్షిణాది ప్రేక్షకులు ఉండరు. మానసిక ప్రశాంతత కోసం ప్రతి వ్యక్తి వినే పాటలు మూడింటిలో రెండు వంతులు ఆయన పాటలే ఉంటాయంటే అతిశయోక్తి కాదు. కరోనా వైరస్ సోకి ఆయన జీవిన్మరణ పోరాటమే చేశారు. సుదీర్ఘంగా నలభై రోజులు చెన్నైలోని ఎంజీఎమ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కోలుకున్నారు.. అనుకునేలోపై మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురై ఈరోజు తుదిశ్వాస విడిచారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం పార్ధీవదేహాన్ని ప్రస్తుతం ఎంజీఎమ్ ఆసుపత్రి నుంచి చెన్నై మహాలింగపురంలోని ఆయన స్వగృహానికి తరలించారు. రేపు ఉదయం వరకు అక్కడే బాలు భౌతికకాయం ఉంచనున్నారు. రేపు ఉదయం చెన్నై శివారు రెడ్‌హిల్స్‌లోని ఆయన ఫామ్ హౌస్‌లో అంత్యక్రియలు జరుపనున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు.