ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. చెన్నైలోని ఆయన స్వగృహం నుంచి తామరైపాక్కంలోని ఫాంహౌస్‌కు బాలు భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లారు. రేపు (శనివారం) ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తమిళనాడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని శుక్రవారం రాత్రే వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. అంతకుముందు ఆయన నివాసంలో గాన గంధర్వుడిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ‘స్వరస్మారనీయుడి’కి అశ్రు నయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. భారీగా జనం వస్తూనే ఉండటంతో బాలు భౌతికకాయాన్ని ఫాంహౌస్‌కు తరలించారు. రేపు ఉదయం 7.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభవుతుంది.