ఎస్పీ బాలు వైద్య చికిత్సకు అయిన ఖర్చెంత.?

కరోనా సోకడంతో ఆసుపత్రి పాలైన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కరోనా నుంచి కోలుకున్నారుగానీ.. ఆసుపత్రి నుంచి ప్రాణాలతో బయటపడలేకపోయారు. కరోనా కారణంగా తలెత్తిన ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఆయన్ని ప్రాణాన్ని బలిగొన్నాయి. సుమారు 50 రోజులపాటు ఎస్పీ బాలుకి ఆసుపత్రిలో వైద్య చికిత్స అందించారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా సుదీర్ఘ కాలం పాటు ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకున్నారుగానీ.. ప్రాణాలతో బయటపడలేకపోయారు. అప్పట్లో జయలలిత వైద్య ఖర్చులు 70 కోట్ల పై మాటేనన్న ప్రచారం జరిగింది. అయితే, ఆమె వైద్య చికిత్స కోసం ఎంత ఖర్చు చేశారన్నది ఇప్పటికీ సస్పెన్సే.

ఇప్పుడు ఎస్పీ బాలు వైద్య చికిత్స ఖర్చు విషయం కూడా చర్చనీయాంశమవుతోంది. ఆసుపత్రికి వైద్య ఖర్చులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లోకి బాలు కుటుంబం నెట్టివేయబడిందంటూ ఓ ప్రచారం తెరపైకొచ్చింది. ఇదంతా దుష్ప్రచారం అని ఇప్పటికే ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ ప్రకటించారు. అయినాగానీ, గాసిప్స్‌ ఆగడంలేదు. దాదాపు 10 కోట్లు ఎస్పీ బాలు వైద్యం కోసం ఖర్చయ్యిందంటూ ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి.

ఓ సాధారణ వ్యక్తి కరోనా సోకితే, కార్పొరేట్‌ ఆసుపత్రులు ఆ వ్యక్తిని ఆర్థికంగా ఎలా చిదిమేస్తున్నాయో చూస్తున్నాం. 3 లక్షల నుంచి 30 లక్షల దాకా ఖర్చు చేసినా, ప్రాణాలతో బయటపడలేని సందర్భాల్ని మీడియాలో అను నిత్యం చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఎస్పీ బాలు సుమారు 50 రోజులపాటు ఆసుపత్రికే పరిమితం కావాల్సి రావడంతో.. ఖర్చు బాగానే అయి వుంటుందన్నది సర్వత్రా విన్పిస్తోన్న వాదన. అయితే, ఈ విషయాన్ని వివాదం చేయడం తగదంటోన్న ఎస్పీ చరణ్‌, ఆసుపత్రి యాజమాన్యంతో కలిసి మీడియా ముందుకొచ్చాడు కూడా.

ఆసుపత్రి యాజమాన్యం ఎంతో బాధ్యతతో బాలుని కాపాడేందుకు ప్రయత్నించిందని అన్నారు ఎస్పీ చరణ్‌. అయితే, విదేశా వైద్య నిపుణుల సూచనలు, సలహాలు.. అత్యాధునిక వైద్య పరికరాలు.. ఇవన్నీ వినియోగించారు ఎస్పీ బాలుని కాపాడేందుకు. సో, ఖర్చు బాగానే అయి వుంటుంది. కానీ, ఈ సమయంలో ఈ ఖర్చు గురించిన చర్చ అవసరమా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఇక్కడ చర్చ, కార్పొరేట్‌ ఆసుపత్రుల దోపిడీ గురించే తప్ప.. ఎస్పీ బాలు కుటుంబం ఆ సొమ్ము చెల్లించడం, చెల్లిచలేకపోవడం గురించి కాదన్నది మెజార్టీ అభిప్రాయం.