మిమ్మల్ని నమ్ముకునే రాజకీయాల్లోకి వచ్చా.. ఆదరించండి: స్టాలిన్

రాష్ట్రంలో కరుణానిధి పాలనను మళ్లీ తీసుకొస్తామని డీఎంకే అధినేత స్టాలిన్ అన్నారు. గుమ్మిడిపూండిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. డీఎంకే అభ్యర్థిగా స్థానికంగా పోటీ చేస్తున్న టీజే గోవిందరాజన్, పొన్నేరి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దురైచంద్ర శేఖర్‌లకు మద్దతుగా స్టాలిన్‌ గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను అన్ని విధాల ఆదుకుంటామన్నారు.

వ్యవసాయం, చేనేతకు ఉచిత విద్యుత్‌ అందజేస్తామని కూడా స్టాలిన్ హామీ ఇచ్చారు. వరికి క్వింటాల్‌కు రూ.2,500, టన్ను చెరుకుకు రూ.4వేల మద్దతు ధర ఇస్తామని ఆయన అన్నారు. డీఎంకే మేనిఫెస్టోను కాపీ చేసి అన్నాడీఎంకే తన మేనిఫెస్టోను రూపొందించిందని ఆరోపించారు. నీట్‌ పరీక్షలను రాష్ట్రంలో అనుమతివ్వొద్దని అధికారంలో ఉన్న అన్నాడీఎంకేను కోరినా ఫలితం లేదని ఆరోపించారు. మిమ్మల్ని నమ్ముకునే రాజకీయాలోక్లి వచ్చానని రాష్ట్రాభివృద్ధి కోసం డీఎంకేను ఆదరించాలని ప్రజలను కోరారు స్టాలిన్.