లూసిఫర్ నుంచి సుజిత్ ఔట్

లూసిఫర్ రీమేక్ ఎప్పటికి అవుతుందో? కాదో? కానీ దాని మీద అలా రకరకాల వార్తలు వినవస్తూనే వున్నాయి. లూసిఫర్ రీమేక్ ను పక్కన పెట్టారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ అది వట్టి గ్యాసిప్ మాత్రమే అని, ఆ ప్రాజెక్టు ఆగలేదని కూడా వినిపించింది. సమస్య అంతా రీమేక్ స్క్రిప్ట్ ను మెగాస్టార్ కు నచ్చేలా తయారుచేయడం దగ్గరే వుంది.

లేటెస్ట్ గా కొత్త గ్యాసిప్ వినిపిస్తోంది. దర్శకుడు సుజిత్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోబోతున్నారన్నది ఆ గ్యాసిప్. రామ్ చరణ్ కు యువి అధినేతలకు వున్న సాన్నిహిత్యంతో సుజిత్ ఈ లూసిఫర్ రీమేక్ లోకి వచ్చారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి సుజిత్ తప్పుకుంటున్నారనే గ్యాసిప్ వినిపిస్తోంది.

హీరో గోపీచంద్ తో యువి సంస్థ నిర్మించే సినిమా ప్రాజెక్టు మీదకు సుజిత్ షిఫ్ట్ అవుతున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. లూసిఫర్ కు మరో డైరక్టర్ ను ఎంపిక చేసే పని జరుగుతోందని కూడా టాక్ వినిపిస్తోంది. లూసిఫర్ రీమేక్ మీద వచ్చే గ్యాసిప్ ల్లో ఒకటిగా మిగిలిపోతుందో? ఇదే నిజమవుతుందో చూడాలి.