దర్శకులు తమ దగ్గర పనిచేసే శిష్యులకు అవకాశాలిచ్చి ప్రోత్సహించడం అనేది సాధారణమే. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ దగ్గర చేరిన బ్యాచ్ లో ప్రతిఒక్కరూ దర్శకునిగా తమదైన ముద్ర వేసుకున్నారు. కృష్ణ వంశీ, తేజ, పూరి జగన్నాథ్, గుణశేఖర్ ఇలా అందరూ వర్మ శిష్యులుగా అప్పట్లో గుర్తింపు పొందారు. ఆ తర్వాత నుండి ఏ దర్శకుడైనా ఒకరిద్దరిని ప్రోత్సహించడం మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ దర్శకునిగా పేరు సంపాదించుకున్న సుకుమార్ తన శిష్యులను ప్రోత్సహించే విషయంలో అందరికంటే ముందున్నాడు.
వారికి దర్శకులుగా అవకాశాలిచ్చి, తాను సహ నిర్మాతగా ఉంటూ స్క్రిప్ట్ లను పర్యవేక్షిస్తూ తన శిష్యులకు అండగా నిలుస్తున్నాడు. కుమారి 21ఎఫ్ ద్వారా పల్నాటి సూర్య ప్రతాప్ ను దర్శకునిగా పరిచయం చేసిన సుకుమార్, 18 పేజిస్ సినిమాతో మరోసారి తనకు అవకాశమిస్తున్నాడు. ఇక ఉప్పెన చిత్రం ద్వారా తన శిష్యుడు బుచ్చిబాబును దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు.
ఇక తాజా సమాచారం ప్రకారం మరో సుకుమార్ శిష్యుడు కూడా దర్శకుడిగా మారబోతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ దగ్గర పనిచేస్తోన్న శ్రీకాంత్ అనే కుర్రాడు నాని హీరోగా ఒక స్క్రిప్ట్ ను అనుకున్నాడట. అది సుకుమార్ కు కూడా నచ్చి తన సహ నిర్మాణంలో సినిమాను తెరకెక్కిస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లాక్ డౌన్ పూర్తయ్యాక శ్రీకాంత్ నానిని కలిసి కథ చేబుతాడట. నానికి స్క్రిప్ట్ నచ్చడం బట్టి ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళేది లేనిది తెలుస్తోంది.
ఏదేమైనా సుకుమార్ శిష్యుల విషయంలో చూపిస్తున్న కేర్ కు మెచ్చుకోకుండా ఉండలేం కదా.