చిరు దర్శకుడు ఈసారి యంగ్ హీరోతో?

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రాన్ని సమర్ధవంతంగా తెరకెక్కించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ సినిమా విడుదలకు ముందు ఇంత భారీ సినిమాను సురేందర్ హ్యాండిల్ చేయగలడా అంటూ వచ్చిన అనుమానాలను పటాపంచలు చేసాడు. భారీతనాన్ని తానూ కూడా హ్యాండిల్ చేయగలనని నిరూపించాడు.

సైరా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ సంగతి పక్కనపెడితే సురేందర్ వరకూ మంచి మార్కులే పడ్డాయి. ఇక సైరా తర్వాత మరోసారి స్టార్ హీరోతో పనిచేయాలని ప్రయత్నించాడు ఈ దర్శకుడు. అందుకే ప్రభాస్, మహేష్, బన్నీ తదితరులకు తన దగ్గర ఉన్న లైన్లు వినిపించాడు. వారికి సురేందర్ తో పనిచేయాలనే ఉన్నా కానీ ముందున్న కమిట్మెంట్ల వల్ల వచ్చే ఏడాది దాకా డేట్లు ఇవ్వలేమని చేతులు ఎత్తేసారు.

దీంతో ఇక చేసేదేం లేక సురేందర్ రెడ్డి యంగ్ హీరోతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సురేందర్ నెక్స్ట్ సినిమా ఉంటుందనే వార్తలు ఈ మధ్య ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. రామ్ కు కూడా సురేందర్ ఇటీవలే కలిసి స్టోరీ అవుట్ లైన్ చెప్పినట్లు సమాచారం.

రామ్ ప్రస్తుతం రెడ్ సినిమా విడుదలకు వేచి చూస్తున్నాడు. ఏప్రిల్ లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. రెడ్ తర్వాత మరో సినిమాను ఒప్పుకోలేదు రామ్. మరి నెక్స్ట్ సినిమా సురేందర్ తోనే చేస్తాడా లేదా అన్నది మరికొంత వేచి చూస్తే తెలిసిపోతుంది.