ఇన్‌సైడ్‌ స్టోరీ: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ని చంపిందెవరు.?

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌.. బాలీవుడ్‌ యువ నటుడు.. మూడు పదుల వయసులోనే నూరేళ్ళు నిండిపోయాయి. ఇంట్లో ఫ్యాన్‌కి ఉరేసుకుని సుశాంత్‌ చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, అతనిది బలవన్మరణం కాదు.. హత్య.. అంటున్నారు కొందరు. మరీ ముఖ్యంగా సుశాంత్‌ కుటుంబ సభ్యులు, ‘హత్య’ జరిగిందంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. మరోపక్క, కొందరు సినీ ప్రముఖులు కూడా సుశాంత్‌ది హత్యేనని చెబుతుండడం గమనార్హం.

ఇంతకీ, తెరవెనుక ఏం జరిగింది.? సుశాంత్‌ ఎందుకు చనిపోయాడు.? సుశాంత్‌ మరణం వెనుక బెంగాలీ బ్యూటీ రియా చక్రవర్తి పాత్ర ఎంత.? ఇలా సవాలక్ష ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. గతంలో సుశాంత్‌, రియా చక్రవర్తి (తెలుగులో ‘తూనీగ తూనీగ’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది) మధ్య ప్రేమాయణం నడిచింది. సుశాంత్‌, చివరిగా ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతున్న విషయం విదితమే.

అయితే, సుశాంత్‌ మరణానికి ఎవరితోనూ లింకులు పెట్టి గాసిప్స్‌ ప్రచారం చేయడం తగదంటూ బాలీవుడ్‌ భామ సోనమ్ కపూర్‌ వ్యాఖ్యానించడం గమనార్హమిక్కడ. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే, ఆ మానసిక సమస్యకు కారణమేంటి.? అంటే, ‘మానసిక ఒత్తిడి’ అంటున్నారు. ఆరు నెలలుగా ఆయన ఈ మేరకు వైద్య చికిత్స కూడా తీసుకుంటున్నాడట. అదే నిజమైతే, బాలీవుడ్‌లో నిత్యం జరిగే ‘హై లైఫ్‌ పార్టీలకు’ హాజరయ్యేవారెవరూ దాన్ని ఎందుకు గుర్తించలేదు.? అన్న ప్రశ్న రావడం సహజమే.

కానీ, ఇలాంటి మానసిక సమస్యలు సినీ జనాలకు సర్వసాధారణహనీ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులూ ఎక్కువగానే ఈ మానసిక ఒత్తిడికి గురవుతున్నారనీ.. ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా, కొందరు ప్రముఖ నిర్మాతలు, కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌కి అవకాశాల్లేకుండా చేశారనీ, అదే సుశాంత్‌ మరణానికి కారణమని ప్రముఖ నటి కంగనా రనౌత్‌ ఆరోపిస్తోంది.

ఎవరి వాదనలు ఎలా వున్నా ఒక్కటి మాత్రం నిజం.. సినీ పరిశ్రమలో తొక్కేయడం అన్నది సర్వసాధారణం. అన్నిసార్లూ ఈ తొక్కేయడం కుదరకపోవచ్చుగానీ.. చాలా సందర్భాల్లో ఈ తొక్కేసే ప్రక్రియ విజయం సాధిస్తుంటుందనీ.. ఆ కారణంగానే చాలామంది యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ యువత ప్రాణాలు కోల్పోతుందనీ సినీ పరిశ్రమకు చెందినవారే చెబుతుండడం కొసమెరుపు.