సుశాంత్, రియా పెళ్లి చేసుకోవాల‌నుకున్నారా?

న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య‌పై పోలీసుల విచార‌ణ నేప‌థ్యంలో మీడియా కూడా మ‌రోవైపు ఇన్వెస్టిగేష‌న్ మొద‌లుపెట్టింది. సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న త‌ర్వాత ఆ విష‌యంలో స‌ర్వ‌త్రా సానుభూతి వ్య‌క్తం అయ్యింది. అయితే మొద‌ట్లో కేసులు, విచార‌ణ‌లు మాత్రం ఊపందుకోలేదు. సుశాంత్ ది ఆత్మ‌హ‌త్యే అని ముంబై పోలీసులు ధ్రువీక‌రించ‌డంతో, హ‌త్య కాద‌ని తేల్చ‌డంతో.. సుశాంత్ డిప్రెష‌న్ తో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ ఒత్తిళ్ల‌కు కారణం ఏమిట‌నే అంశంపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వినిపించాయి.

బాలీవుడ్ లో సుశాంత్ ను తొక్కేశార‌ని, సుశాంత్ కు అవ‌కాశాలు ఇవ్వ‌లేద‌ని, అత‌డితో అనుకున్న ప‌లు సినిమాలు వేరే న‌టుల‌కు వెళ్లాయ‌ని.. ఇలాంటి కార‌ణాలే అయ్యుండొచ్చు, ప్రేమ కార‌ణాలు అయ్యుండొచ్చు.. అనే అభిప్రాయాలు వినిపించాయి. త‌న ఆత్మ‌హ‌త్యకు కార‌ణం ఏమిటో సుశాంత్ సింగ్ కూడా ఎలాంటి లేఖ రాయ‌లేద‌ని పోలీసులు ప్ర‌క‌టించారు.

అయితే సుశాంత్ తండ్రి త‌న త‌న‌యుడి ఆత్మ‌హ‌త్య విష‌యంలో సంచ‌ల‌న ఫిర్యాదు చేశారు. న‌టి రియా చ‌క్ర‌బ‌ర్తి ప‌రోక్షంగా త‌న త‌న‌యుడి ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం అనే త‌ర‌హాలో ఆయ‌న ఫిర్యాదు చేశారు. సుశాంత్ అకౌంట్ నుంచి భారీగా డ‌బ్బు ను కూడా రియా కుటుంబీకులు బ‌దిలీ చేయించుకున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో రియా కూడా వేగంగా స్పందించి, ఆ కేసు విచార‌ణ ముంబైలో జ‌ర‌గాల‌ని కోర‌డం, ఆమె ముంద‌స్తు బెయిల్ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలో బాలీవుడ్ మీడియా మ‌రో విష‌యాన్ని క‌నిపెట్టింద‌ట‌. ఒక హౌస్ బ్రోక‌ర్ ద్వారా అక్క‌డి మీడియా ఒక క‌థనాన్ని చెప్పిస్తోంది. సుశాంత్, రియాలు పెళ్లి చేసుకోవాల‌నుకున్నార‌ని, వారు బ‌స చేయ‌డానికి నెల‌కు నాలుగు ల‌క్ష‌ల రూపాయ‌ల రెంటుతో ఒక ఇంటిని కూడా చూడాల‌ని రియా త‌న‌ను కోరిన‌ట్టుగా ఆ హౌస్ బ్రోక‌ర్ చెప్పాడ‌ట‌. త‌ను, సుశాంత్ కాపురం ఉండ‌టానికి ఆ ఇల్లు అని రియా అత‌డికి చెప్పింద‌ట‌. ఇదంతా సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు కొన్ని రోజుల ముందు జ‌రిగిన‌ట్టుగా అత‌డు చెప్పాడ‌ట‌. ఈ విష‌యాన్ని బాలీవుడ్ మీడియా చెబుతోంది.