సుశాంత్ మృతిపై ఎయిమ్స్ కీలక నివేదక.. ఆరోజు ఏం జరిగిందంటే..

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసుపై ఎయిమ్స్ కీలక విషయాలను వెల్లడించింది. సుశాంత్ ఆత్మహత్యపై సుదీర్ఘ పరిశీలన అనంతరం కీలక రిపోర్టును ప్రభుత్వానికి అందించింది. సుశాంత్‌ మృతదేహంలో ఎలాంటి విషం లేదని.. సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడమే ఆయన మృతికి కారణమని ఎయిమ్స్‌ ధృవీకరించింది. సుశాంత్‌ డీఎన్‌ఏను పూర్తిగా పరిశీలించామని.. తర్వాతే నివేదిక ఇచ్చామని ఇందులో ఎటువంటి సందేహాలకు తావు లేదని ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి. దీంతో సుశాంత్ ఆత్మహత్యకు మానసిక ఒత్తిడే కారణమని వైద్యులు అంచనా వేస్తున్నారు.

దీంతో సుశాంత్‌ మృతిపై నెలకొన్న అనుమానాలకు దీంతో తెరపడినట్టైంది. సుశాంత్ ను గొంతు నులిమి హత్య చేసి ఉండొచ్చని అతని తండ్రి బిహార్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసును కేంద్రం సీబీఐకి అప్పిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిమ్స్‌ ఇచ్చిన రిపోర్టు కీలకంగా మారింది. ఈకేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి వాంగ్మూలం మేరకు డ్రగ్స్‌ వ్యవహారంపై ఎన్సీబీ విచారణ జరుగుతోంది.

ఈ కేసులో సీబీఐ దర్యాప్తు నెమ్మదించిందని సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్‌ సింగ్‌ ఆరోపిస్తున్నారు. సుశాంత్‌ మృతిపై దర్యాప్తును కాకుండా.. ఎన్సీబీ డ్రగ్స్‌ కేసుపై ఎక్కువ దృష్టి పెడుతోందని ఆరోపించారు. సుశాంత్ మృతదేహం ఫొటోలు చూసిన ఎయిమ్స్ డాక్టర్ ఒకరు ఇది హత్యే అయి ఉంటుందని కూడా అంటున్నారు. మరి ఈ కేసులో విషయం మరెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.