ఈ గోలేంటి బాబూ, వెనక్కి తీసేస్కోండి

అక్షయ్‌కుమార్‌కి జాతీయ అవార్డు రావడం సర్వత్రా విమర్శలకి గురవుతోన్న సంగతి తెలిసిందే. అక్షయ్‌ మంచి నటుడు కాదని కాదు కానీ, రుస్తుం సినిమాకి అతనికి ఈ అవార్డు ఇవ్వడం మాత్రం చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. దంగల్‌లో అమీర్‌ఖాన్‌, ఫాన్‌లో షారుక్‌ ఖాన్‌ అంత గొప్ప అభినయంతో అదరగొడితే వాళ్లని కాదని అక్షయ్‌కి అవార్డు ఇవ్వడంతో అందరూ జ్యూరీని తప్పుబడుతున్నారు.

పాతికేళ్ల నట జీవితంలో తొలిసారిగా వచ్చిన జాతీయ అవార్డుని ఆనందంగా స్వీకరించలేకపోతున్న అక్షయ్‌ ఇప్పటికే ఈ అవార్డు కొనుక్కోలేదని, లాబీయింగ్‌ చేయలేదని వివరణ ఇచ్చుకున్నాడు. ఇంకా గోల తగ్గకపోయే సరికి ఈ అవార్డు వెనక్కి తీసేసుకున్నా అభ్యంతరం లేదని, పాతికేళ్లలో ఎప్పుడూ ఇవ్వనిది ఇప్పుడిచ్చారని, అవార్డులు ప్రకటించిన ప్రతిసారీ వాటిని విమర్శించడం సాధారణమని, అయితే ఇన్నేళ్లలో పలుమార్లు తనకి కొన్నిసార్లు రావాల్సిన అవార్డులే రాలేదని, ఇప్పటికి వచ్చిందని ఆనంద పడుతోంటే ఈ విమర్శలేంటంటూ అక్షయ్‌ అసహనం వ్యక్తం చేసాడు.

జ్యూరీకి హెడ్‌గా వ్యవహరించిన దర్శకుడు ప్రియదర్శన్‌ కూడా ఎవరికి అనుకూలంగా వున్న హీరోలకి వాళ్లు అవార్డులు ఇచ్చుకున్నారని వ్యాఖ్యానించడం కొసమెరుపు. దీనిని బట్టే మన ఇండియన్‌ సినిమా అవార్డులలోని పారదర్శకత ఏమిటనేది స్పష్టమవుతోంది.