కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివస్ యాదవ్ మండిపడ్డారు. హైదరాబాద్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందంటూ బీజేపీ నాయకులు ఆందోళన చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలే ఎక్కువ ఉన్నాయని అన్నారు. మర్కజ్ విషయంలో కేంద్రం ఏం చేసిందని ప్రశ్నించారు. వలస కార్మికులకు తాము సూచిస్తేనే రైళ్లు ఏర్పాటు చేసిందని అన్నారు. అప్పటి వరకూ కేంద్రం ఏం చేసిందంటూ దుయ్యబట్టారు.
బీజేపీ నేతలు చేస్తున్న ఆందోళనలు మానుకోవాలని అన్నారు. బీజేపీ నాయకులు చేస్తున్న చిల్లర రాజకీయాలు మానుకోకపోతే కేంద్రం చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతూ ప్రధాని మీద వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రధాని ఇప్పటికైనా తమ నాయకులను కంట్రోల్ లో పెట్టుకోవాలని అన్నారు. కరోనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన పని లేదని అన్నారు. ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని మంత్రి అన్నారు.