టీడీపీ వర్సెస్‌ వైసీపీ: ‘ఇటు’ నుంచి అటు.. అటు నుంచి ‘ఎటు’.!

రాజకీయాల్లో రాత్రికి రాత్రి ఈక్వేషన్స్‌ మారిపోవచ్చు. అదే రాజకీయమంటే. పైగా, ఇప్పుడు రాజకీయాలు ఎలా వున్నాయ్‌.! నిన్న ఈ పార్టీలో, రేపు ఇంకో పార్టీలో.. ఎల్లుండి మరో పార్టీలో.! ఇలా వుంది రాజకీయ నాయకుల తీరు. ఒక్క మాటలో చెప్పాలంటే, రాజకీయ నాయకులనగానే ‘కప్పల తక్కెడ’ గుర్తుకొస్తోంది చాలామందికి. ఇందులో నిజం లేకపోలేదు.

అసలు విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయి. టీడీపీ నుంచి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపు దూకేశారు. మరో ఆరుగురు పార్టీ మారడానికి సిద్ధంగా వున్నారనే ప్రచారం గత కొద్ది రోజులుగా విన్పిస్తోంది. ‘అబ్బే.. మాకు అలాంటి ఆలోచన లేదు.. మా మీద దుష్ప్రచారం జరుగుతోంది..’ అంటూ ఆ ఆరుగురిలో కొందరు వివరణ ఇచ్చారు. ఇంతలోనే, చంద్రబాబుపై తిరుగుబాటు స్వరం విన్పించారు టీడీపీ సీనియర్‌ నేత కరణం బలరాం.

మరోపక్క, వైసీపీలోనూ అసమ్మతి రాజకీయాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇసుక పేరుతోనో, మరో పేరుతోనో పలువురు ‘అసమ్మతి’ రాగం విన్పిస్తున్నారు వైసీపీలో. మీడియాలో విన్పిస్తున్న కథనాల ప్రకారం ఓ అరడజను మంది ఎమ్మెల్యేలు, ఓ ఇద్దరు ఎంపీలు.. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీరు పట్ల అసహనంతో వున్నారట. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడానికి సిద్ధంగా వున్నారన్నది నిర్వివాదాంశం. కానీ, వైసీపీ నుంచి టీడీపీలోకి నేతలు వెళ్ళే పరిస్థితి వుందా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

‘ఒక్కసారి మీరు గేట్లు తెరిచి చూడండి.. వైసీపీ నుంచి టీడీపీలోకి ఎంత మంది వచ్చేస్తారో..’ అంటూ ఆ మధ్య ఓ టీడీపీ నేత బీభత్సమైన డైలాగు పేల్చారుగానీ.. అంత సీన్‌ ప్రస్తుతానికి టీడీపీకి లేదు. కానీ, బీజేపీ మాత్రం ‘సరైన సమయం’ కోసం ఎదురుచూస్తోంది. టీడీపీని ‘చచ్చిన పాము’గా భావిస్తున్న బీజేపీ, అవకాశం దొరికితే వైసీపీని దెబ్బకొట్టాలని మాత్రం చూస్తోంది. ‘రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు అనూహ్యంగా మారబోతున్నాయి.. మా పార్టీ అత్యంత కీలక భూమిక పోషించబోతోంది..’ అంటూ బీజేపీ నేతలు కొందరు ఈ మధ్య మీడియా ముందు చాలా కాన్పిడెంట్‌గా చెబుతున్నారు.

త్వరలో ఏపీ మంత్రి వర్గంలో చిన్న చిన్న మార్పులు జరగనున్నాయనీ.. అదే రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన మార్పుకు ‘ముహార్తం’ కాబోతోందనీ రాజకీయ వర్గాల్లో స్పెక్యులేషన్స్‌ విన్పిస్తున్నాయి. వైసీపీ మాత్రం, ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు పోటీ ఇచ్చే పార్టీనే రాష్ట్రంలో లేదు.. ఆయా పార్టీలు పూర్తిగా కనుమరుగు కాబోతున్నాయి రానున్న రోజుల్లో’ అని చెబుతుండడం గమనార్హం.