టాలీవుడ్ డైరక్టర్ తేజకు కరోనా సోకిందనే విషయం సంచలనంగా మారింది. కరోనాతో జాగ్రత్తగా ఉండండంటూ పలు మార్లు, పలు సందర్భాల్లో చెప్పిన వ్యక్తికే కరోనా రావడంతో అంతా షాక్ అయ్యారు. నిజానికి తేజ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఆయనకు కరోనా సోకింది. డాక్టర్లు చెప్పిన ప్రకారం ఆయనకు కంటి ద్వారా కరోనా సోకిందట.
అందరూ అనుకుంటున్నట్టు వెబ్ సిరీస్ షూట్ కోసం తేజ ముంబయి వెళ్లలేదు. నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టుడియోస్ లోనే షూటింగ్ చేశారు. ఆ టైమ్ లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖానికి మాస్క్ వేసుకున్నారు. చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్ తో కూడా శుభ్రం చేసుకున్నారు. అయినప్పటికీ తేజకు కరోనా సోకింది.
ఒక్కసారిగా ఒళ్లు నొప్పులతో పాటు తీవ్రంగా జ్వరం రావడంతో ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. అందులో పాజిటివ్ గా తేలింది. ఆ వెంటనే ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. గాలిలో ఉన్న కరోనా వైరస్ కంటి ద్వారా తేజకు సోకి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం తేజ ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయనకిప్పుడు జ్వరం, ఒళ్లు నొప్పులు లేవు. అయినప్పటికీ వైద్యుల సూచన మేరకు ఆయన 2 వారాల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. ఈ కరోనా టైమ్ లో ఎలాంటి షూటింగ్స్ పెట్టుకోకపోవడమే మంచిదని, తప్పనిసరిగా పెట్టుకోవాల్సి వస్తే ఫేస్ షీల్డ్ కూడా వాడాలని తన సన్నిహితులతో చెబుతున్నారు తేజ.
అయితే ఈమధ్య 2-3 కార్యక్రమాల్లో పాల్గొన్నారు తేజ. వెబ్ సిరీస్ షూట్ తో పాటు.. ఆడిషన్స్ కూడా నిర్వహించారు. 2-3 స్టోరీ సిట్టింగ్స్ కూడా చేశారు. ఏ సందర్భంలో ఆయనకు కరోనా సోకిందనేది అంతుచిక్కడం లేదు.