తేజ ఇప్పటికి ఒప్పుకున్నాడు

‘జయం’ సినిమాతో తిరుగులేని బ్లాక్ బస్టర్ ఇచ్చిన తేజ.. ఆ తర్వాత గత 15 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క హిట్టు కొట్టలేదు. తాను కొత్త సినిమా తీసిన ప్రతిసారీ ఇది మామూలు కథ కాదని గొప్పలు పోవడం.. కసిగా సినిమా తీశాననడం.. ఈసారి హిట్టు గ్యారెంటీ అని చెప్పడం.. తీరా చూస్తే.. ఆ సినిమా చెత్తగా ఉండటం.. ప్రేక్షకులు నిరాశ చెందడం.. ఇది మామూలైపోయింది.

‘హోరాహోరి’ సినిమా చూశాకైతే తేజ మీద జనాలకు పూర్తిగా నమ్మకం పోయింది. సినిమా పేలవంగా ఉండటం ఒక కోణమైతే.. ఆయన ‘జయం’ ఫార్ములాను పట్టుకుని వేలాడటం మరో కోణం. ఐతే ఎట్టకేలకు ‘జయం’ ఫార్ములాను వదిలేసి.. ‘నేనే రాజు నేనే మంత్రి’ రూపంలో ఒక డిఫరెంట్ పొలిటికల్ థ్రిల్లర్ చేశాడు తేజ. ఈ సినిమా తేజ గత సినిమాలకు భిన్నంగా.. కొంచెం బాగుండేలాగే కనిపిస్తోంది.

ఈ సినిమా ప్రమోషన్ కోసం మీడియా ముందుకొచ్చిన తేజ.. గత పదిహేనేళ్లలో తాను తీసిన ఫ్లాప్ సినిమాల గురించి మాట్లాడాడు. కథల్లో లోపం వల్లే ఆ సినిమాలు ఆడలేదని తేజ అంగీకరించాడు. అలాగని తాను అప్ డేట్ కాలేదంటే ఒప్పుకోనని తేజ తేల్చి చెప్పాడు. ఒకసారి తప్పు చేశామంటే.. మళ్లీ మళ్లీ అవే తప్పులు జరిగిపోతుంటాయని.. అలాగే తాను కూడా వరుసబెట్టి తప్పులు చేశానని తేజ అన్నాడు.

తన కథలు బాలేకపోవడం వల్లే సినిమాలు ఆడలేదన్నది వాస్తవమని.. ఐతే కొన్నిసార్లు సినిమా ఆడదని ముందే తెలిసినా.. ఆడుతుందనే ఆశ వాస్తవాన్ని డామినేట్ చేసిందని తేజ చెప్పడం విశేషం. ‘‘నిజానికి నాకు  ఎదురైన పరాజయాలన్నీ నేను ఊహించినవే’’ అని తేజ చెప్పడం విశేషం. ‘నేనే రాజు నేనే మంత్రి’ టీజర్.. ట్రైలర్ చూశాక తన విషయంలో ఇండస్ట్రీ జనాలు చాలా భిన్నంగా ప్రవర్తిస్తున్నారని.. ఇంతకుముందు ముఖం తిప్పుకున్న వాళ్లు ఇప్పుడు జేబుల్లోంచి చేతులు తీసి కంగ్రాట్స్ చెబుతున్నారని తేజ చెప్పడం విశేషం.