బర్త్‌డే స్పెషల్‌: సూపర్‌ స్టార్‌ల మోస్ట్‌ వాంటెడ్‌ కంపోజర్‌

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా సూపర్‌ హిట్‌ అనే విషయం తెల్సిందే. ఆ సినిమా సూపర్‌ హిట్‌లో కీలక పాత్ర థమన్‌ ది అంటూ స్వయంగా బన్ని మరియు త్రివిక్రమ్‌ అన్నారు అంటే ఆ సినిమా పాటలు మరియు నేపథ్య సంగీతం ఏ స్థాయిలో సూపర్‌ హిట్‌ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. సౌత్‌ ఇండియాలో ఇప్పటి వరకు ఏ సినిమా మ్యూజిక్‌ ఆల్బం కూడా దక్కించుకోని అరుదైన రికార్డును ఈ సినిమాకు థమన్‌ తెచ్చి పెట్టాడు అనడంలో సందేహం లేదు. అల వైకుంఠపురం సినిమాలో ప్రతి పాట కూడా యూత్‌ ఆడియన్స్‌ ను ఆకట్టుకున్నాయి. బుట్టబొమ్మ పాటకు ఇంటర్నేషనల్‌ రేంజ్‌ లో గుర్తింపు వచ్చింది.
అంతటి సూపర్‌ హిట్‌ ను అందుకున్నా కూడా తన పారితోషికం విషయంలో భారీ మార్పు చేయడం కాని కేవలం స్టార్స్‌ తో మాత్రమే చేస్తాను అంటూ గిరి గీసుకుని కూర్చోవడం వంటివి చేయని సంగీత దర్శకుడు థమన్‌. ఇప్పటికి కూడా కోటి నుండి కోటిన్నర పారితోషికం అందుకోవడంతో పాటు చిన్న సినిమాలకు సంగీతం అందించినప్పుడు కోటి లోపు పారితోషికంను కూడా చేసే ఆయన అతి తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలకు సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడిగా థమన్‌ నిలిచాడు.
థమన్‌ సినీ కెరీర్‌ నటుడిగా పరిచయం అయ్యింది. బాయ్స్‌ లో ఒక హీరోగా కనిపించిన థమన్‌ ఆ తర్వాత 2008 సంవత్సరంలో సంగీత దర్శకుడిగా మారాడు. 2009 సంవత్సరంలో కిక్‌ కు సంగీతాన్ని అందించడంతో అంతా ఈయన వైపు చూశారు. 2011 లో ఈయన దూకుడు సినిమాకు సంగీతం అందించడంతో స్టార్‌ కంపోజర్‌గా మారిపోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఓ రేంజ్‌ లో దూసుకు పోతున్నాడు. థమన్‌ పై కాపీ మరక ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా తనకు తాను మోటివేట్‌ చేసుకుంటూ వస్తూ స్టార్‌ కంపోజర్‌ గా ఇప్పుడు నిలిచాడు.
టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ లో ఈయన 50కి పైగా సినిమాలు చేశాడు. మలయాళంలో కూడా ఈయన ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. టాలీవుడ్‌ లో ప్రస్తుతం మహేష్‌ బాబు సర్కారు వారి పాట కోసం ప్రస్తుతం ఈయన వర్క్‌ చేస్తున్నాడు. తమిళంలో కూడా స్టార్‌ హీరోలకు ఈయన వర్క్‌ చేస్తున్నాడు. వకీల్‌ సాబ్‌ కు కూడా ఈయనే సంగీతాన్ని అందిస్తున్నాడు. సూపర్‌ స్టార్ లకు మోస్ట్‌ వాంటెడ్‌ కంపోజర్‌ గా థమన్‌ ఉన్నాడు.