గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం జయంతి నేడు. ఈ సందర్బంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా బాలు గారిని గుర్తు చేసుకుని ఆయనకు నివాళ్లు అర్పిస్తున్నారు. సోషల్ మీడియాలో బాలు గారి హ్యాష్ ట్యాగ్ తో పెద్ద ఎత్తున అభిమానులు ట్వీట్స్ చేస్తూ ఆయన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఆయన పాటలను గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘన నివాళ్లు అర్పిస్తూ ఉన్నారు.
బాల సుబ్రమణ్యం జయంతి సందర్భంగా థమన్ ఒక వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియో లో తెలుగు ఇండియన్ ఐడల్ కు చెందిన చిన్న వీడియోను ఆయన షేర్ చేశాడు. వీడియోలో బాలు తో తాను చిన్నప్పుడు తీసుకున్న ఒక ఫోటోను కూడా చూపించాడు. ఆ ఫోటో గురించి థమన్ మాట్లాడుతూ… ఈ ఫోటోను 1997 లో తీసుకున్నాను. 1996 లో మా నాన్న చనిపోయారు. తదుపరి సంవత్సరం ఒక కార్యక్రమానికి మా ఇంటికి వచ్చారు.
ఆ సమయంలో నా పాస్ పోర్ట్ ను తీసుకున్నారు. యూఎస్ లో ఈవెంట్ కు తీసుకు వెళ్లారు. మేము కలిసి అమెరికా వెళ్లాము. అక్కడ స్టేజ్ షో చేశాము. ఆ తర్వాత ఆయనతో కలిసి నేను ఏడు వేల స్టేజ్ షో లను చేశాను.
ఇది బాలు గారితో నా ఫస్ట్ ఫోటో. నేను వెళ్లి ఫోటో అడిగినప్పుడు.. ఏంట్రా ఫోటో నా రా.. తీసుకో అన్నారు. అలాంటి బాండింగ్ మా ఇద్దరి మద్య ఉండేది. ఈ 26 సంవత్సరాల జర్నీ ఆయనతో అద్బుతంగా సాగింది. లవ్ యూ బాలు మామ.. మిస్ యు బాలు మామ.
థమన్ చినప్పటి నుండి మ్యూజిక్ లో పెరిగాడు. నటుడిగా ఎంట్రీ ఇచ్చినా కూడా మ్యూజిక్ పై ఇష్టంతో ఎన్నో వాయిద్య పరికరాలను వాయించడంలో దిట్ట. ప్రస్తుతం టాలీవుడ్ లో థమన్ యొక్క స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద హీరోల సినిమా కు సంగీతం అంటే మొదటి ఛాయిస్ థమన్ అన్నట్లుగా పరిస్థితి మారింది.
చిన్నా పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమా లు చేస్తూనే ఉన్నాడు. అతి తక్కువ సమయంలోనే 70 సినిమాలకు పైగా సంగీతాన్ని అందించి స్పీడ్ విషయంలో రికార్డు సృష్టించాడు. అల వైకుంఠపురంలో.. భీమ్లా నాయక్.. అఖండ.. ఇప్పుడు సర్కారు వారి పాట ప్రతి సినిమాకు కూడా థమన్ వాయింపు మామూలుగా ఉండదని అందరితో అనిపించుకున్నాడు.