న్యాయవ్యవస్థపై స్పీకర్‌ తమ్మినేని ‘ప్రవచనాలు’.!

వ్యవస్థల మధ్య ఆధిపత్య పోరు వుండకూడదు.. ఓ వ్యవస్థలోకి ఇంకో వ్యవస్థ తొంగి చూడకూడదు.. ఓ వ్యవస్థను అడ్డం పెట్టుకుని, ఇంకో వ్యవస్థపై దాడి చేయకూడదు.. ఇలా ఎప్పటినుంచో రాజ్యాంగ నిపుణులు ఆయా వ్యవస్థల ఔన్నత్యం గురించి మాట్లాడుతూనే వున్నారు. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ తాజాగా ఓ కార్యక్రమంలో కొత్తగా ప్రవచించారు. న్యాయ వ్యవస్థ.. చట్ట సభలు.. ఈ రెండూ చాలా చాలా ప్రత్యేకమైనవి.. భారత ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైనవి. కానీ, ఇప్పుడు ఈ రెండు వ్యవస్థల మధ్యా ‘ఘర్షణ’ వాతావరణం కన్పిస్తోంది.. అది, వ్యవస్థల్లో లోపం కాదు. ఆ వ్యవస్థల్ని నడుపుతున్న వ్యక్తుల కారణంగా.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులపైనా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైనా సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ ఫిర్యాదుని తప్పు పట్టలేం. కానీ, ఈ ఫిర్యాదుకి ముందూ వెనుక.. చాలా కథ నడిచింది. న్యాయమూర్తుల్ని వైసీపీ నేతలు కావొచ్చు, వైసీపీ మద్దతుదారులు కావొచ్చు.. అత్యంత హేయంగా విమర్శించారు.. న్యాయ వ్యవస్థను కించపర్చారు. ‘ఫుడ్‌ కోర్టు’ అంటూ ఉన్నత న్యాయస్థానంపైనా, సర్వోన్నత న్యాయస్థానంపైనా సోషల్‌ మీడియా వేదికగా వైసీపీ మద్దతుదారులు చేసిన విమర్శల్ని ఎలా మర్చిపోగలం.?

తమ్మినేని సీతారాం సైతం పలు సందర్భాల్లో ఆయా వ్యవస్థలపై మాట్లాడేటప్పుడు సంయమనం కోల్పోయిన వైనం చూశాం. ప్రజలు వేసిన ఓట్లతో అధికారంలోకి వచ్చాం కాబట్టి, తాము ఎలాంటి చట్టాలు చేసినా, వాటిపై న్యాయస్థానాలు స్పందించకూడదన్నది ప్రభుత్వాల ఆలోచన అయితే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ఆయా చట్టాలు, రాజ్యాంగానికి లోబడి వున్నాయా.? లేదా.? అన్న విషయమై న్యాయస్థానాలు ఖచ్చితంగా సమీక్ష చేస్తాయి.. చేయాలి కూడా.

ఎవరన్నా తమకు ప్రభుత్వాల నిర్ణయాల కారణంగా అన్యాయం జరిగిందని న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తే, అక్కడ నిర్ణయాలు చేసింది ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు కాబట్టి, బాధితులకు న్యాయస్థానాలు న్యాయం చేయకూడదని అంటే ఎలా.? నిజానికి, చాలా సున్నితమైన సందర్భమిది.

న్యాయ వ్యవస్థలో కింది కోర్టులో న్యాయం దొరక్కపోతే, పై కోర్టును ఆశ్రయించే అవకాశం వుంది. హత్య చేసిన వ్యక్తికి కూడా తాను నిర్దోషినని నిరూపించుకునేందుకు అనేక అవకాశాలు కల్పిస్తుంది న్యాయ వ్యవస్థ.. ఇదీ మన న్యాయవ్యవస్థ గొప్పతనం. ఏ వ్యవస్థ పని ఆ వ్యవస్థ చేయాలి.. చివరికి ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అన్ని వ్యవస్థలో అంతిమంగా ప్రజల కోసమే పనిచేయాలి. ‘న్యాయ సలహా’ అనేదాన్ని ఖచ్చితంగా పాటించి, ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోగలిగితే, న్యాయ సమీక్ష ముందు అవి తేలిగ్గానే నెగ్గుతాయ్‌ కదా.!