రానా స్టామినాకు రియల్ టెస్ట్

దగ్గుబాటి రానా కెరీర్ ఆరంభంలో హీరోగా నిలదొక్కుకోవడానికి చాలానే ఇబ్బంది పడ్డాడు. తొలి సినిమా ‘లీడర్’ ఆశించిన ఫలితాన్నివ్వకపోగా.. ఆ తర్వాత చేసిన ‘నా ఇష్టం’.. ‘నేను నా రాక్షసి’ డిజాస్టర్లుగా నిలిచాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రిష్ సినిమా ‘కృష్ణం వందే జగద్గురుం’ కూడా బోల్తా కొట్టేయడంతో రానా హీరోగా పనికి రాడని తేల్చేశారు. అలాంటి సమయంలోనే ‘బాహుబలి’లో విలన్ పాత్ర చేయాలన్న సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం అద్భుత ఫలితాన్నిచ్చింది. ఈ సినిమాతో రానా కెరీరే మారిపోయింది. దేశవ్యాప్తంగా తిరుగులేని పేరు సంపాదించి.. అన్ని ఇండస్ట్రీల్లోనూ క్రేజీ ఆర్టిస్టుగా మారిపోయాడు రానా. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘ఘాజీ’ కూడా అతడికి మంచి పేరే తెచ్చిపెట్టింది.

ఐతే ‘ఘాజీ’ కంటెంట్ బేస్డ్ ఫిలిం. అందులో రానా పాత్ర పరిమితం. అందులో హీరో ఆ సబ్ మెరైనే. రానా అందులో ఒక పార్ట్ మాత్రమే. ఐతే ఇప్పుడు రానా నుంచి వస్తున్న కొత్త సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ అలా కాదు. ఆ సినిమాకు ప్రధాన ఆకర్షణ రానానే. ఇందులోని కంటెంట్ జనాల్ని బాగానే ఆకర్షించింది కానీ.. అంతకుమించి రానా కటౌట్ జనాల్లో మరింతగా చర్చనీయాంశమైంది. అతడి గెటప్.. యాటిట్యూడ్.. యాక్టింగ్.. అన్నీ కూడా జనాల్లో క్యూరియాసిటీ తీసుకొచ్చాయి. రానా ఏ సినిమాలో లేనంత కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడీ సినిమాలో.

తొలిసారిగా హీరోగా రానా క్రేజ్ సంపాదించుకున్నది కూడా ఈ సినిమాతోనే. ప్రేక్షకుల్ని థియేటర్లకు ఆకర్షిస్తున్నది కూడా అతనే. తేజ లాంటి ఫ్లాప్ డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించినప్పటికీ.. జనాలు ఈ సినిమాపై దృష్టిసారించడానికి కారణం కూడా రానానే. టీజర్.. ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ శుక్రవారం రాబోతున్న మూడు సినిమాల్లో అగ్ర తాంబూలం కూడా ‘నేనే రాజు నేనే మంత్రి’కే దక్కొచ్చని అంచనా వేస్తున్నారు. ఐతే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తే సరిపోదు. వాళ్లను కూర్చోబెట్టడం కీలకం. రానా మీద ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకం ఏమాత్రం ఫలిస్తుందో.. హీరోగా అతడికున్న ఇమేజ్.. క్రేజ్ ఎలాంటిదో ‘నేనే రాజు నేనే మంత్రి’తో తేలిపోతుందని భావిస్తున్నారు. మరి ఈ శుక్రవారం ఏమవుతుందో చూడాలి.