ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ తిరథ్ సింగ్ రావత్ ను పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో ఆయన్ను సీఎంగా ఎన్నుకుంటూ పార్టీ వర్గాలు బుధవారం తీర్మానం చేశాయి. 2013-14 మధ్య ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన 56 ఏళ్ల తిరథ్.. గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. 2019లో గర్వాల్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆరెస్సెస్ కు సన్నిహితుడైన తిరథ్.. గత రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటివరకు ఉత్తరాఖండ్ సీఎంగా ఉన్న త్రివేండ్ర రావత్ రాజీనామా చేయడంతో కొత్త సీఎంను ఎన్నుకోవాల్సి వచ్చింది. పనితీరు సరిగా లేదనే కారణంగా రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం ఆదేశాల మేరకు త్రివేండ్ర రావత్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై పార్టీ పెద్దలు సమాలోచనలు జరిపారు. కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తోపాటు ఉత్తరాఖండ్ మంత్రి ధన్ సింగ్ రావత్ తదితరుల పేర్లు పరిశీలించి.. చివరకు ఎంపీ తిరథ్ సింగ్ రావత్ ను ఖరారు చేశారు.