యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తాను చేస్తోన్న ఆర్ ఆర్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జతకట్టిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు లాక్ డౌన్ కు ముందే బయటకు వచ్చాయి. హారిక అండ్ హాసినితో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తారు. అల వైకుంఠపురములో చిత్రంలో సూపర్ హిట్ ఆల్బమ్ ను అందించిన థమన్ మరోసారి త్రివిక్రమ్ తో కలిసి పనిచేయబోతున్నాడు. నిజానికి ఈ చిత్రాన్ని జులైలోనే పట్టాలెక్కించాలనుకున్నారు కానీ అనుకోకుండా కరోనా కారణంగా షూటింగులు అన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోవడంతో ఈ చిత్రం కూడా ప్రారంభం కాలేదు.
లాక్ డౌన్ కు ముందు జూన్ కల్లా ఆర్ ఆర్ ఆర్ లో తన పార్ట్ షూటింగ్ పూర్తైపోతుందని ఆశించాడు ఎన్టీఆర్. అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి మొదలవ్వడానికే మరో రెండు నెలలు పట్టే అవకాశముంది. అయితే ఈలోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తుండగా ఇప్పుడా స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.
ఇక తాజా సమాచారం ప్రకారం, త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలోనే ఎన్టీఆర్ ను పర్సనల్ గా కలిసి స్క్రిప్ట్ ను నరేట్ చేస్తాడని తెలుస్తోంది. ఈ మీటింగ్ లోనే సినిమా ఎప్పుడు ప్రారంభమయ్యేది ఇద్దరూ ఒకసారి అనుకుంటారని, ఒకవేళ వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ వరకూ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు లేకపోతే ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మరో సినిమా చేసే అవకాశాన్ని పరిశీలిస్తాడని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకూ నిజముందో తెలియదు.