ఇంకో ఆప్ష‌నేది లేక‌..ట్రంప్ వెన‌క్కు త‌గ్గాడు

అమెరికా తాజా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్‌ ఒబామా ఎడ్డమంటే…తెడ్డమనే ప్ర‌స్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఒబామాకు హాయంలోని కీల‌క నిర్ణ‌యంపై కాస్త వెన‌క్కు త‌గ్గారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు దోహదపడుతుందని న‌మ్మిన ఒబామా స‌ర్కారు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆరు దేశాలతో ఇరాన్‌ ‘పౌర అణు ఒప్పందం’ కుదుర్చుకుంది. అయితే ఒబామా హయాంలోని నిర్ణ‌యాల‌న్నింటినీ స‌మీక్షిస్తున్న ట్రంప్ ఈ ఒప్పందాన్ని సైతం ర‌ద్దు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో దీనిపై కీలకమైన సమావేశం జరిపి ర‌ద్దు చేయాల్సిందేన‌ని తేల్చిచెప్పిన ట్రంప్‌ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. తాజాగా తన సలహాదారుల మాటను గౌరవిస్తూ, మరో మూడు నెలలపాటు ఇరాన్‌ అణు ఒప్పంద అమలుకు అంగీకారం తెలిపారు. ఈ విషయాన్నే ట్రంప్‌ సర్కార్‌ తాజాగా అమెరికా చట్టసభకు అధికారికంగా తెలియజేసింది.

కీల‌క‌మైన ఈ ఒప్పందంపై అమెరికా చట్టం ప్రకారం, ఇరాన్‌ పౌర అణు ఒప్పందంపై ప్రతీ మూడు నెలలకు ఒకమారు ప్రభుత్వం తన నిర్ణయాన్ని కాంగ్రెస్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. ఇరాన్‌ తన అణు కార్యక్రమాన్ని కుదించుకుంటేనే ఒప్పందాన్ని కొనసాగించాలన్న నిబంధన ఇందులో ప్రధానమైంది. దీనిని ఆధారంగా చేసుకొనే ఆ దేశంపై అంతర్జాతీయ ఆంక్షల్ని ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, అతని సలహాదారులు, రక్షణ శాఖ తదితరులు గత బధవారం రెండో సమీక్ష జరిపాయి. ఒప్పందాన్ని రద్దు చేయవద్దు, పాత విధానాన్నే కొనసాగిద్దామని ఉన్నతస్థాయి సలహాదారుల బృందం ట్రంప్ కు సూచించింది. అయితే ఇరాన్‌ పౌర అణు ఒప్పందం నుంచి వైదొలగాలన్నదే మొదటి సమీక్షలో ట్రంప్‌ నిర్ణయం. అయితే ఇరాన్‌ను నియంత్రించే మరో వ్యూహముంటే తనకు చెప్పండని సలహాదారుల్ని ట్రంప్‌ అడిగారు. ఇందుకోసం వారు మరికొంత సమయాన్ని కోరారు. అమెరికా మిత్ర దేశాలతో, కాంగ్రెస్‌తో చర్చించిన అనంతరం తమ వ్యూహాన్ని వెల్లడిస్తామని వారు ట్రంప్‌నకు చెప్పారట.

కాగా, ఈ ఒప్పందం అమల్లో ఉన్నంతకాలం అమెరికా ఏకపక్షంగా ఇరాన్‌పై ఆంక్షల్ని విధించే అవకాశం లేదని ట్రంప్‌నకు తెలుసు. ఒకవేళ అలా చేస్తే…భాగస్వామ్య దేశాల మధ్య ఉన్న సంయుక్త కమిటీలో ఇరాన్‌ ప్రశ్నిస్తుంది. ఒప్పందాన్ని అమెరికా అతిక్రమించినట్టే. కాబట్టే మొత్తం ఒప్పందాన్నే రద్దు చేయాలన్నది ట్రంప్‌ ఎత్తుగడ. అయితే ఆయన ఆలోచనా విధానాన్ని యూరోపియన్‌ దేశాలు తప్పుబడుతున్నాయి. ఇరాన్‌ను దెబ్బకొట్టాలనే వ్యూహం పశ్చిమాసియాలో శాంతికి విఘాతం కలుగిస్తుందని ఈయూ దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపేథ్యంలో ట్రంప్ దూకుడు నిర్ణ‌యం వాయిదాప‌డింది.