సీపీఐ నేత టీవీ చౌదరి మృతి

ఖమ్మం జిల్లాకు చెందిన సీపీఐ సీనియర్‌ నేత తుళ్లూరు వెంకయ్య చౌదరి అలియాస్‌ టీవీ చౌదరి తీవ్ర అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఆయన మృతిపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరియు జాతీయ పార్టీ ముఖ్య నాయకులు సురవరం సుధాకర్‌ రెడ్డి ముఖ్య నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, చాడ వెంకట్‌ రెడ్డితో పాటు పలువురు సంతాపం తెలియజేశారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు తెచ్చుకుని శ్రద్దాంజలి ఘటించారు.

80 ఏళ్ల టీవీ చౌదరి గత కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. గత రాత్రి ఆయన తీవ్ర అనారోగ్యం పాలవ్వడంతో ఖమ్మంలోని తన నివాసంలో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్ట్‌ పార్టీ వ్యాప్తికి టీవీ చౌదరి చేసిన కృషి ఎవరు కాదనలేనిది.

సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేయడంతో పాటు పలు పార్టీ పదవులు మరియు సంఘాల పదవులు నిర్వహించారు. ఆయన మృతి ఖమ్మం జిల్లా సీపీఐ పార్టీకి తీరని లోటు అంటూ జిల్లా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ఖమ్మం సీపీఐ పార్టీ ఆఫీస్‌కు టీవీ చౌదరి బౌతిక కాయంను తరలించబోతున్నారు. ఆ తర్వాత ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు చెప్పారు.