సినీ రంగంలో ఏ క్రాఫ్ట్‌లో అయినా సరే.. తొలి అవకాశం అన్నది చాలా పెద్ద విషయం. అందుకోసం ఏళ్లు, దశాబ్లాలు ఎదురు చూస్తున్నారు. అందుకోసం ఎంతగానో కష్టపడతారు. ముఖ్యంగా ఒక సినిమా విషయంలో కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనదగ్గ దర్శకుడిగా అరంగేట్రం చేయడమంటే మాటలు కాదు. ఈ కల నెరవేర్చుకోవడానికి ఒక్కొక్కరు పడే కష్టం అలాంటిలాంటిది కాదు.
ఒక పేరున్న సంస్థలో చెప్పుకోదగ్గ సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలంటే ఎన్నో అంశాలు కలిసి రావాలి. అలా అన్నీ కలిసొచ్చి.. ఏళ్ల నిరీక్షణ ఫలించి.. తొలి సినిమా డైరెక్ట్ చేసే అవకాశం లభించి.. ఆ టాస్కును విజయవంతంగా పూర్తి చేసి.. ఫస్ట్ కాపీ కూడా రెడీ చేశాక.. పరిస్థితులు ఎదురు తిరిగితే.. సినిమా భవితవ్యం ఏంటో అర్థం కాకపోతే.. విడుదల కోసం కొన్ని నెలల పాటు ఎదురు చూడాల్సి వస్తే..? ఇప్పుడు అలాంటి ఇబ్బందికర పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు బుచ్చిబాబు సానా.
అగ్ర దర్శకుడు సుకుమార్ దగ్గర చాలా ఏళ్లుగా పని చేస్తున్నాడు బుచ్చిబాబు. సుకుమార్‌కు అత్యంత ఇష్టమైన అసిస్టెంట్లలో సుక్కు ఒకడు. తన అసిస్టెంట్లందరూ దర్శకులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకునే సుక్కు.. టాలెంట్ ఉన్న వాళ్లను బాగానే ఎండోర్స్ చేస్తున్నాడు. పల్నాటి సూర్యప్రతాప్‌కు ఎంతో సపోర్ట్ చేశాడు.
తన మిత్రుడైన హరిప్రసాద్ జక్కాకు తనే అవకాశమిచ్చాడు. ఈ కోవలోనే బుచ్చిబాబు దర్శకుడిగా మారడంలో సుక్కు కీలకంగా వ్యవహరించాడు. తనకు బాగా క్లోజ్ అయిన మైత్రీ మూవీస్ వాళ్లతో అతడికి సినిమా ఇప్పించాడు. మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కొత్తమ్మాయి కృతి శెట్టి జంటగా మైత్రీ బేనర్లో ‘ఉప్పెన’ సినిమా తీశాడు బుచ్చిబాబు.
ఈ సినిమా పోస్టర్లు, ఇతర ప్రోమోలు చూస్తే బుచ్చిబాబు విషయం ఉన్నోడే అని అర్థమవుతోంది. అతడి అభిరుచి ప్రతిచోటా కనిపించింది. విజయ్ సేతుపతి ఇందులో కీలక పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడంటే బుచ్చిబాబు స్క్రిప్టులో బలం ఉన్నట్లే. ఐతే ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించి.. ఎంతో కష్టపడి సినిమా పూర్తి చేస్తే విడుదల ముంగిట లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. అంతా అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 2నే ఈ సినిమా విడుదల కావాల్సింది.
కానీ లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారు.. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో.. ఈ సినిమా విడుదలకు ఎప్పుడు ముహూర్తం కుదురుతుందో.. మారిన పరిస్థితుల నేపథ్యంలో జనాలు ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు వస్తారో తెలియక టెన్షన్ పడుతున్నాడట బుచ్చిబాబు. పాపం.. ఇలాంటి పరిస్థితుల్లో తన అరంగేట్ర సినిమా చిక్కుకుంటుందని అతను ఊహించి ఉండడు.