వకీల్ సాబ్‌ డైరెక్టర్‌ కు పవన్ కానుక గాలి వార్తే

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన వకీల్‌ సాబ్‌ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ ఆలోచనలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందంటూ టాక్ వచ్చింది. ఒక మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీని కమర్షియల్‌ యాంగిల్‌ లో దర్శకుడు వేణు శ్రీరామ్‌ తెరకెక్కించిన తీరు బాగుందంటూ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. దర్శకుడు వేణు శ్రీరామ్‌ ను పవన్‌ కళ్యాణ్‌ కూడా ప్రశంసించినట్లుగా వార్తలు వచ్చాయి. వేణును ప్రశంసించడం మాత్రమే కాకుండా తనకు ఒక మంచి రీ ఎంట్రీ ఇచ్చినందుకు గాను ఖరీదైన బహుమానం కూడా ఇచ్చాడంటూ వార్తలు వచ్చాయి. ట్రిపుల్‌ బెడ్‌ రూం ప్లాట్‌ ను దాదాపుగా కోటిన్నర పెట్టి కొనుగోలు చేసి దర్శకుడు వేణు శ్రీరామ్‌ కు ఇచ్చాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై పవన్‌ వర్గీయులు మరియు దిల్ రాజు కాంపౌండ్‌ వారు స్పందించారు. పవన్‌ కళ్యాణ్ ఖరీదైన బహుమానంను వేణు శ్రీరామ్‌ కు ఇచ్చినట్లుగా వచ్చిన వార్తలు నిజం కాదన్నారు. వకీల్‌ సాబ్‌ విడుదల అయినప్పటి నుండి కూడా పవన్ కళ్యాణ్‌ కరోనా కారణంగా పూర్తిగా హోం క్వారెంటైన్‌ కు వెళ్లి పోయారు. ఆయన ఏ ఒక్కరిని కలిసిన దాఖలాలు లేవు. ఇక దర్శకుడు వేణు శ్రీరామ్‌ ను కలిసి అభినందించి ఖరీదైన ప్లాట్ ను ఇచ్చే అవకాశం లేదంటున్నారు. ఇవి కేవలం పుకార్లు మాత్రమే అని వీటిని నమ్మి షేర్‌ చేయవద్దంటూ కొందరు పవన్ సన్నిహిత వర్గాల వారు సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.