టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్.. ఇదే మరి కామెడీ అంటే. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించిన వల్లభనేని వంశీ, ఆ తర్వాత వైసీపీలో చేరిపోయిన విషయం విదితమే.
వల్లభనేని వంశీని చాలామంది పార్ట్ టైమ్ పొలిటీషియన్ అంటుంటారు. కారణం, ఆయన ప్రజలకు అందుబాటులో వుండరట. ఎవరు అధికారంలో వుంటే, వారితో అంటకాగడం వంశీకి వెన్నతో పెట్టిన విద్య అనే ఆరోపణలున్నాయి. రాజకీయాల్లో ఇలాంటివన్నీ సర్వసాధారణమే.
ఒకప్పుడు పరిటాల రవి అనుచరుడిగా పనిచేసిన వల్లభనేని వంశీ, ఆ పరిటాల రవికి ప్రత్యర్థి అయిన మద్దెలచెరువు సూరికి అనుచరుడిగానూ కొన్నాళ్ళు పనిచేశారు. అలా ఫ్యాక్షన్ రాజకీయాలతోనూ వంశీకి పరిచయాలున్నాయి. ‘అబ్బే, ఆ గొడవలతో నాకు సంబంధం లేదు..’ అని వంశీ అంటుంటారు.. అది వేరే సంగతి.
అసలు విషయమేంటంటే, గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న తాను, తన పదవికి రాజీనామా చేస్తానంటున్నారు వల్లభనేని వంశీ. దమ్ముంటే చంద్రబాబు అయినా, లోకేష్ అయినా.. గన్నవరం నుంచి తన మీద పోటీ చేయాలన్నది వల్లభనేని వంశీ సవాల్.
కామెడీ అంటే ఇదే మరి. టీడీపీ నుంచి దాదాపు అరడజను మంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిపోయారు. జనసేన నుంచి ఓ ఎమ్మెల్యే, వైసీపీలో చేరారు. వీరిలో ఎవరూ ఇంతవరకు రాజీనామా చేసిన పాపాన పోలేదు. ‘పార్టీ మారితే, వెంటనే పదవి పోవాలి అధ్యక్షా..’ అంటూ అసెంబ్లీ సాక్షిగా నినదించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇంతవరకు వాళ్ళ పదవుల్ని ఎందుకు పీకెయ్యలేదో ఏమో.!
‘పరిటాల సునీతను నేను వదినమ్మగానే భావిస్తాను..’ అంటూ రాజీనామా సవాల్ విసిరిన వల్లభనేని వంశీకి, అంత చిత్తశుద్ధి వుంటే, ఏనాడో రాజీనామా చేసేసి.. దాన్ని ఆమోదించేసుకుని, వైసీపీ నుంచి పోటీ చేసేవారే.