వరుణ్ తేజ్ హీరోగా రేపు ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘గని’ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిన్న రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. సినిమా నేపథ్యానికి తగినట్టుగా ‘రిలీజ్ పంచ్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముంబై నుంచి సునీల్ శెట్టి .. బెంగుళూర్ నుంచి ఉపేంద్ర కూడా ఈ ఫంక్షన్ కి హాజరయ్యారు. ఈ సినిమాకి ఈ ఇద్దరూ కూడా చెరో పిల్లర్ లా అనిపిస్తారని అల్లు అరవింద్ అన్నారు. ఆ తరువాత ఒంట్లో బాగోలేకపోయినా వరుణ్ తేజ్ ఈ సినిమాకి వచ్చాడని చెప్పారు.
అయితే ఈ కార్యక్రమానికి వరుణ్ తేజ్ కాస్త ఆలస్యంగానే వచ్చాడు. అసలు వాళ్లు ఆలస్యంగా రావడం కామనే కదా అనుకుంటే వరుణ్ తేజ్ చేతికి ‘ఐవీ సెట్’ కనిపించింది. దాంతో స్టేజ్ దగ్గర ఉన్నవాళ్లు .. ఇటు లైవ్ లో చూసేవాళ్లంతా కూడా వరుణ్ కి ఏమైంది? అనుకున్నారు. వరుణ్ కి ఒంట్లో బాగోలేకపోవడం వలన బెడ్ పైనే ఉన్నాడనీ ఫంక్షన్ కి రాగలుగుతావా? అని తాను అడిగితే పాక్కుంటూ అయినా వస్తానంటూ ఉత్సాహాన్ని చూపించాడని అల్లు అరవింద్ అనడంతో వరుణ్ తేజ్ ఐవీ పెట్టుకుని రావడం హైలైట్ అయింది.
ఈ సినిమా పట్టాలెక్కడంలో కీలకమైన పాత్రను పోషించింది వరుణ్ తేజ్. అటు కొత్త డైరెక్టర్ కిరణ్ కొర్రపాటిని కొత్త నిర్మాతలకు పరిచయం చేసింది .. వాళ్లను ముగ్గులోకి దింపింది వరుణ్ తేజ్ నే. ఆయనపైగల నమ్మకంతోనే అల్లు బాబీ – సిద్ధు ముద్ద కిరణ్ చేతిలో ఈ ప్రాజెక్టు పెట్టారు.
హీరోగా ఒక సినిమా చేసుకుని వెళ్లిపోవడం వేరు .. బాధ్యతను తలపై వేసుకోవడం వేరు. కోట్ల రూపాయల బిజినెస్ కనుక టెన్షన్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. అందువలన వరుణ్ ఏమైనా టెన్షన్ పడ్డాడేమోనని అనుకుంటున్నారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ కొన్ని రోజులుగా తీరిక లేకుండా తిరుగుతున్నాడు. మొన్న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. అందువలన అలసిపోయి జ్వరాన పడ్డాడేమోనని కూడా అనుకుంటున్నారు. ఇక అదే రోజు రాత్రి హైదరాబాద్ లోని పబ్ లో డ్రగ్స్ కలకలం .. నిహారిక పేరు బయటికి రావడం .. టీవీల్లో ఎక్కడ చూసినా స్టేషన్ బయటికి వస్తున్న నిహారిక వీడియోనే ప్రసారమవుతూ వచ్చింది. తన సినిమా రిలీజ్ కి ముందు ఈ విధంగా జరగడం వలన వరుణ్ టెన్షన్ అయ్యుంటాడని మరికొంత భావిస్తున్నారు. నిజమేమిటనేది మాత్రం వరుణ్ కే తెలియాలి.