‘గురు’వు గారిని మరిచిపోకండి..

రెండు వారాల తర్వాత సమ్మర్ సినిమాల సందడి మొదలైపోతుంది. ముందుగా ఈ సందడికి శ్రీకారం చుట్టబోయేది పవర్ స్టార్ పవన్ కళ్యాణే. మార్చి 24కే పవన్ సినిమా ‘కాటమరాయుడు’ థియేటర్లలోకి దిగిపోనుంది. అంటే సమ్మర్ ఆరంభంలోనే బాక్సాఫీస్ హీటెక్కిపోతుందన్నమాట. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని తర్వాత సందడంతే ‘బాహుబలి: ది కంక్లూజన్’దే. ఆ సినిమా విడుదలకు నెల ముందు నుంచే హంగామా నెలకొనబోతోంది. ఆ సినిమా సందడయ్యాక అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ మీదికి ఫోకస్ మళ్లుతుంది. ఆపై మహేష్ సినిమా అందుకుంటుంది.

ఐతే వీటి మధ్య మరో పెద్ద హీరో సినిమా రాబోతున్న సంగతి అందరూ మరిచిపోతున్నారు. అదే.. గురు. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గురు’ మీద ముందు నుంచి అంతగా ఫోకస్ ఉండట్లేదు. ఇది తమిళ రీమేక్ కావడం.. చడీచప్పుడు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకోవడంతో ఈ సినిమాపై అనుకున్న స్థాయిలో హైప్ లేదు. పైగా జనవరిలో అనుకున్న సినిమా ఏకంగా మూడు నెలలు వాయిదా పడిపోయింది. ఎందుకోగానీ ఈ చిత్ర బృందం కూడా ముందు నుంచి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తోంది.

ఐతే ‘కాటమరాయుడు’ వచ్చిన రెండు వారాలకే ‘గురు’ను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాటమరాయుడు రిలీజ్ తర్వాత వారం వెయిట్ చేసి ఆ తర్వాత రిలీజ్ వీక్‌లో ప్రమోషన్ల జోరు పెంచాలని చూస్తున్నారు. ఈ లోపు అప్పుడప్పుడూ ఒక పాట లాంచ్ చేస్తూ సినిమాను వార్తల్లో నిలబెట్టాలని చూస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి రెండు పాటలు బయటికి వచ్చాయి. ఆ రెండూ ఆకట్టుకున్నాయి. ‘కాటమరాయుడు’ రిలీజ్ తర్వాత అదే వీకెండ్లో ‘గురు’ ఆడియో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. తమిళ హిట్ మూవీ ‘ఇరుదు సుట్రు’కు రీమేక్‌గా తెరకెక్కతున్న ఈ చిత్రానికి ఒరిజినల్ డైరెక్టర్ సుధ కొంగరనే దర్శకత్వం వహిస్తోంది. రితిక సింగ్ కీలక పాత్రధారి.