మళ్లీ డైరెక్షనా.. వద్దు బాబోయ్

దర్శకులవ్వాలన్న ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనుకోకుండా నటులుగా మారిన వాళ్లు చాలామందే ఉంటారు. వాళ్లు నటులుగా ఎంత పేరు సంపాదించినప్పటికీ.. ఏదో ఒక దశలో దర్శకత్వం చేపట్టాలన్న ఆశ ఉంటుంది.

‘వెన్నెల’ సినిమాతో కమెడియన్‌‌గా అరంగేట్రం చేసి.. తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించి.. చాలా తర్వాగానే బిజీ కమెడియన్ అయిపోయిన వెన్నెల కిషోర్ కూడా ఈ కోవకు చెందిన వాడే. ఐతే అతను మిగతా వాళ్లలా మెగా ఫోన్ పట్టడానికి ఎక్కువ కాలం ఏమీ ఎదురు చూడలేదు.

తాను నటుడిగా పరిచయం అయిన ‘వెన్నెల’ సినిమాకు కొనసాగింపుగా ‘వెన్నెల వన్ అండ్ హాఫ్’తో దర్శకుడిగా మారాడు. అది చేదు అనుభవాన్ని మిగల్చడంతో బ్రహ్మానందం హీరోగా ‘జఫ్ఫా’ అనే మరో సినిమా తీశాడు. అది కూడా తేడా కొట్టేసింది. దీంతో మళ్లీ దర్శకత్వం జోలికి వెళ్లలేదు కిషోర్.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మళ్లీ దర్శకత్వం ఎప్పుడు అని అడిగితే.. ‘‘నేను మళ్లీ దర్శకత్వం చేయకపోతేనే నాతో సహా అందరికీ మంచిది. ప్రస్తుతానికి నాకీ విషయంలో పూర్తి స్పష్టత ఉంది. సమీప భవిష్యత్తులో అయితే నేను దర్శకత్వం చేసే అవకాశం లేదు’’ అని వెన్నెల కిషోర్ స్పష్టం చేశాడు.

నటుడిగా తన కెరీర్ ఇప్పుడు చాలా సంతృప్తికరంగా సాగిపోతోందని కిషోర్ తెలిపాడు. అఖిల్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో పాటు నితిన్ చిత్రం ‘రంగ్ దె’లో నటిస్తున్నానని.. ఇంకా అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘పుష్ప’లోనూ అవకాశం వచ్చిందని.. అన్నిటికీ మించి మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’లో నటిస్తున్నానని.. తన కెరీర్లోనే అతి పెద్ద అవకాశాల్లో ఇదొకటని.. చిరంజీవితో ఆల్రెడీ ఒక వారం పని చేశానని.. ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నానని.. ఇందులో చిరంజీవి తన పాత్రలో అదరగొడుతున్నాడని కిషోర్ తెలిపాడు.