లేడీ కమెడియన్ ఎందుకు బరువు తగ్గింది?

ఏడాదిగా కష్టపడి 20 కిలోలు తగ్గింది హాస్యనటి విద్యుల్లేఖ. త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతోంది కాబట్టి కష్టపడి వెయిట్ తగ్గిందని కొందరు అనుకున్నారు. సినిమాల్లో మరింతగా రాణించేందుకు ఆమె బరువు తగ్గిందని మరికొందరన్నారు. అయితే తను బరువు తగ్గడానికి అసలు కారణం ఏంటో వివరించింది విద్యు. ఓ ఘటన తనను పూర్తిగా మార్చేసిందని చెబుతోంది.

“మహేష్ తో మహర్షి సినిమా చేస్తున్నప్పుడు 86 కిలోలు ఉన్నాను. ఆ టైమ్ లో నా పేరెంట్స్ నాకొక డ్రెస్ కొన్నారు. అప్పుడు వేసుకుంటే చాలా బాగుంది. బాగా సూట్ అయింది. కానీ 25 రోజుల తర్వాత మళ్లీ అదే డ్రెస్ వేసుకుంటే నాకు పట్టలేదు. కనీసం మోకాళ్ల నుంచి పైకి కూడా రాలేదు. జస్ట్ 25 రోజులకే అంత లావు అయిపోయాను. అప్పుడే నాకు సిగ్గేసింది. ఎలాగైనా తగ్గాలని నిర్ణయించుకున్నాను. నేను వెయిట్ లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే.”

ఈ ఘటనతో పాటు తన ఆరోగ్య సమస్యలు కూడా బరువు తగ్గడానికి కారణమని చెబుతోంది విద్యుల్లేఖ. లావుగా ఉన్న టైమ్ లో చాలా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేదంట. వాటి నుంచి బయటపడ్డానికి బరువు తగ్గడమే ఏకైక మార్గమని గ్రహించిందట. మరోవైపు తన పెళ్లిపై కూడా రియాక్ట్ అయింది విద్యు.

“నా కాబోయే భర్త సంజయ్, నేను గతేడాది నుంచే ప్రేమించుకుంటున్నాం. 2020లో ఎంగేజ్ మెంట్ చేసుకుందామని, 2021లో పెళ్లి చేసుకుందామని గతేడాదే అనుకున్నాం. అంతలోనే కరోనా వచ్చింది. అన్నీ మారిపోయాయి. కానీ కాస్త లో-ప్రొఫైల్ లోనైనా ఎంగేజ్ మెంట్ చేసుకుంటే మా అమ్మా-నాన్న హ్యాపీగా ఉంటారని భావించి నిశ్చితార్థం చేసుకున్నాం. పెళ్లికి అందర్నీ పిలవలేకపోచ్చు.. అందుకే లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చే ఆలోచన చేస్తున్నాం”

ఇలా తన పెళ్లి కబుర్లతో పాటు.. వెయిట్ లాస్ ప్రొగ్రామ్ గురించి బయటపెట్టింది ఈ లేడీ కమెడియన్.