నేను మహేశ్ కి పెద్ద ఫ్యాన్: విజయ్ దేవరకొండ

తెలుగు తెరపైకి మాంఛి దూకుడు మీద వచ్చిన హీరో విజయ్ దేవరకొండ. కథలను ఎంచుకునే విషయంలోను ఆయన అదే దూకుడు చూపిస్తూ వచ్చాడు .. తన సినిమాల ప్రమోషన్స్ విషయంలోనూ అదే దూకుడు చూపిస్తూ వచ్చాడు. ఆ దూకుడే ఆయనకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది. విజయ్ దేవరకొండను చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఏ విషయాన్ని నాన్చడు .. తాను అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ వెళుతుంటాడు.

విజయ్ దేవరకొండ మాటలు విన్నప్పుడు ఆయనలో ఆవేశం మాత్రమే ఉందని అనుకుంటారు. కానీ ఆయన ‘రౌడీస్’ బ్రాండ్ స్టార్ట్ చేయడం .. సొంత బ్యానర్లో సినిమాలు స్టార్ట్ చేయడం చూస్తే ఆయనకి ముందుచూపుతో కూడిన ఆలోచన కూడా ఉందనే విషయం అర్థమవుతుంది. ఇక పాన్ ఇండియా సినిమా చేయడంలోను ఆయన ఇదే దూకుడును చూపించాడు. కెరియర్ ను ఆరంభించిన చాలా తక్కువ కాలంలోనే ఆయన ఈ రేంజ్ లో ఎదిగాడు. ఆయన బ్యానర్ పై నిర్మితమైన ‘పుష్పక విమానం’ ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. హాలీవుడ్ స్టార్స్ లో ఆస్కార్ విన్నర్ డెంజెల్ వాషింగ్ టన్ .. మెరీల్ స్ట్రీప్ అంటే తనకి చాలా ఇష్టమని చెప్పాడు. ఇక బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ యాక్టింగ్ ను తాను ఎక్కువగా ఇష్టపడతానని అన్నాడు. టాలీవుడ్ లో తన ఫేవరెట్ హీరో మహేశ్ బాబు అనీ .. ఆయనకి తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు. ఆయన డైలాగ్ డెలివరీ .. సింపుల్ కనిపిస్తూనే తనదైన స్టైల్ ను చూపించే విషయంలో ఆయన తనకి బాగా నచ్చుతాడని అన్నాడు.

మహేశ్ బాబు .. విజయ్ దేవరకొండ కొన్ని సినిమా ఫంక్షన్స్ లో కలుసుకున్నారు. అప్పుడు వాళ్లిద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. విజయ్ గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు “ఈ జనరేషన్ లో యూత్ పై ఎక్కువ ప్రభావం చూపిన హీరో విజయ్ దేవరకొండ” అని ఆయన చాలా బోల్డ్ గా చెప్పాడు. ఈ ఇద్దరినీ ఒకే వేదికపై చూసిన అభిమానులు ఒకే తెరపై చూడాలని కోరుకుంటున్నారు. మరి వాళ్ల ముచ్చట తీరుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం నిర్మాతగా ‘పుష్పక విమానం’ ప్రమోషన్లో ఉన్న విజయ్ దేవరకొండ ఈ నెల 12వ తేదీన ‘లైగర్’ సినిమా షూటింగు కోసం అమెరికా వెళుతున్నాడు.