రాష్ట్రంలో రాజకీయం అత్యంత హేయమైన స్థాయికి దిగజారిపోయింది. తమ వెనకాల బోల్డన్ని కేసులు పెట్టుకుని, ఇతరుల మీద విమర్శలు చేస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు. అసలు రాజకీయాలంటేనే, తమ వెనుకాల కేసులుండాలన్నట్టు తయారైంది ప్రస్తుతం పరిస్థితి. ఎవరి మీద ఎక్కువ కేసులుంటే, వాళ్ళే రాజకీయాల్లో సర్వోత్తములన్నమాట. కొత్తగా కేసులు ఎవరి మీదన్నా నమోదవుతున్నాయంటే, ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో కొత్త అర్హత సాధిస్తున్నారని అనుకోవాల్సిన దుస్థితి.
అసలు విషయంలోకి వస్తే, మాజీ మంత్రి దేవినేని ఉమ మీద సీఐడీ కేసు నమోదయ్యింది. ఆయన విచారణకు హాజరు కాలేదు. కోర్టు నుంచి కాస్త వెసులుబాటు తెచ్చుకున్నారు. తప్పక, ఆయన సీఐడీ విచారణను ఎదుర్కోవాల్సి వుంది. దానికోసం ముహూర్తం కూడా ఖరారయ్యింది. అయితే, తానేమీ తప్పు చేయలేదంటున్నారు దేవినేని ఉమ. తప్పు చేశారా.? లేదా.? అన్నది తేల్చాల్సింది న్యాయస్థానాలు. ఈలోగా, రాజకీయాల్లో పత్తిగింజల వ్యవహారం షురూ అయ్యింది.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, దేవినేని ఉమ తీరుని పత్తి గింజలతో పోల్చారు సోషల్ మీడియా వేదికగా. ‘దేవినేని ఉమ మీద నమోదైన కేసు గురించి మీరు మాట్లాడటమా.? మరి, మీ మీద వున్న కేసులో.?’ అంటూ టీడీపీ అభిమానులు, విజయసాయిరెడ్డి మీద విరుచుకుపడుతున్నారు. బీభత్సమైన ట్వీట్లతో హోరెత్తించేస్తున్నారు. పనిలో పనిగా ఏ1, ఏ2 అంశాలూ తెరపైకొస్తున్నాయి.
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ ఏ1 నిందితుడు కాగా, విజయసాయిరెడ్డి ఏ2 నిందితుడన్నది అందరికీ తెలిసిన విషయమే. నిజానికి, విజయసాయిరెడ్డి.. రాజకీయ విమర్శలు చేసే క్రమంలో కేసులు, అరెస్టులు, పత్తిగింజల వ్యవహారాల గురించి అస్సలు మాట్లాడకూడదు. కానీ, ముందే చెప్పుకున్నాం కదా.. ఎవరి మీద ఎక్కువ కేసులుంటే, వాళ్ళే ఇతరుల్ని ర్యాగింగ్ చేయడం కొత్త ట్రెండ్ అయ్యిందన్నమాట. అద్గదీ అసలు సంగతి.