పీక్స్‌కి చేరిన విజయసాయిరెడ్డి పబ్లిసిటీ స్టంట్స్‌.!

కరోనా వైరస్‌ ఓ పక్క ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని విలవిల్లాడిస్తోంటే, వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాత్రం తనదైన స్టయిల్లో పబ్లిసిటీ స్టంట్స్‌ చేస్తూ అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ‘కరోనా వైరస్‌ కంటే అధికార పార్టీ నేతల పబ్లిసిటీ స్టంట్లే అత్యంత ప్రమాదకరం’ అని జనం బెంబేలెత్తిపోవాల్సి వస్తోందంటే.. ఆ స్థాయిలో అధికార పార్టీ నేతలు పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు మరి.

మొన్నీమధ్యనే చిత్తూరు జిల్లాలో ఓ వైసీపీ నేత, పెద్దయెత్తున ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఆ కారణంగా అక్కడ కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరిగిపోయాయంటూ సోషల్‌ మీడియా వేదికగా కథనాలు దర్శనమిస్తున్నాయి. ఆ ట్రాక్టర్ల ర్యాలీ తర్వాత ఆ ప్రాంతంలో కరోనా వైరస్‌ కేసులు పెరగడమే అందుక్కారణం. ఆ సంగతి పక్కన పెడితే, విజయసాయిరెడ్డి, ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో, మంత్రి అవంతి శ్రీనివాస్‌తో కలిసి పేదలకు నిత్యావసర వస్తువులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.

ఈ క్రమంలో జనం పెద్దయెత్తున గుమికూడారు. ‘సోషల్‌ డిస్టెన్స్‌’ అన్న మాటకే అర్థం లేకుండా పోయిందక్కడ. జర్నలిస్టులు ఈ వ్యవహారాన్ని కవర్‌ చేయడానికి పోటీ పడటం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. విశాఖ ప్రాంతంలో కరోనా వైరస్‌ కేసులు ఎక్కువే వున్నాయి. అయినాగానీ, అధికార పార్టీ నేతలు.. పైగా ఒకరు మంత్రి, ఇంకొకరు రాజ్యసభ సభ్యుడు అత్యంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడం గమనార్హం.

చేసింది మంచి పనే అయినా, ఆ పని కారణంగా కరోనా వైరస్‌ ప్రబలే అవకాశం లేకపోలేదన్న కనీసపాటి విజ్ఞతని ప్రదర్శించని రాజకీయ నాయకుల్ని ఏమనాలి.? రోడ్డు మీద నలుగురైదుగురు జనం గుమికూడితో పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. మరి, రాజకీయ నాయకులు ఇలా పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంటే ఎందుకు పోలీసులు ఉపేక్షిస్తున్నారు.? బహుశా అధికార పార్టీ నేతలకు కరోనా నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారేమో.!